న్యూఢిల్లీ: క్రికెట్ ఆటగాళ్లు తక్కువ వయసు చూపి ఆడుతున్నారని మాజీ బాక్సర్ విజేందర్ సింగ్ చేసిన ట్వీట్ వివాదం అవుతున్నది. ఐపీఎల్ స్టార్ పర్ఫార్మ్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi)ని మాజీ బాక్సర్ టార్గెట్ చేసి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. 14 ఏళ్ల వైభవ్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. అయితే ఈ బీహార్ కుర్రాడు ఐపీఎల్ లో హిస్టరీ క్రియేట్ చేశాడు. 35 బంతుల్లో సెంచరీ కొట్టిన అతిపిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు.
ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బాక్సర్ విజేందర్ తన ట్వీట్లో క్రికెటర్లను విమర్శించాడు. ఈ రోజుల్లో వయసు తక్కువ చెప్పి క్రికెట్లో కూడా ఆటగాళ్లు ఆడుతున్నారని తన ట్వీట్లో పేర్కొన్నాడు. వాస్తవానికి ఆ ట్వీట్లో ఎవరి గురించి చెప్పాడో సూటిగా లేదు. కానీ వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. వయసు ఎక్కువ ఉన్నా.. తక్కువగా చూపిస్తున్నారని తన ట్వీట్ ద్వారా బాక్సర్ విజేందర్ ఆరోపించారు. ట్వీట్ చేసిన టైమింగ్‌పై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐపీఎల్లో వైభవ్ సెంచరీ చేసిన నేపథ్యంలో విజేందర్ అతన్ని టార్గెట్ చేసి ఉంటారని భావిస్తున్నారు.
సూర్యవంశీ ఏజ్‌పై డౌట్స్ వ్యక్తం కావడంతో.. కొందరు ఏకంగా సోషల్ మీడియాలో పాత వీడియోలను పోస్టు చేశారు. ఆ వీడియోల్లో అతను వయసు కన్నా ఎక్కువ ఏజ్‌లో ఉన్నట్లు కనిపించాడు.
Bhai aaj kal umar choti ker ke cricket me bhe khelne lage 🤔
— Vijender Singh (@boxervijender) April 30, 2025