Morne Morkel | టీమిండియా ఫ్టాస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నాయకత్వ సామర్థ్యంపై భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే బోర్డర్ గవాస్కర్ సిరీస్ కోసం టీమిండియా ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. పెర్త్ వేదికగా జరిగే తొలిటెస్ట్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడం లేదు. ఇటీవల రోహిత్‌కు తనయుడు జన్మించిన విషయం తెలిసిందే. దాంతో కీలక సిరీస్‌లో తొలిమ్యాచ్‌కు రోహిత్ దూరమయ్యాడు. ఇక ప్రారంభ మ్యాచ్‌కు జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌కు ఈ మిస్టరీ బౌలర్‌ను సెలెక్షన్ కమిటీ వైస్ కెప్టెన్‌గా నియమించింది. బుమ్రా గతంలో 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదోటెస్ట్కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆస్ట్రేలియాతో జరిగే ఐదుటెస్టుల సిరీస్‌లో యువ ఫాస్ట్ బౌలర్లకు బుమ్రా మార్గనిర్దేశనం చేస్తాడని బౌలింగ్ కోచ్ మోర్కెల్ పేర్కొన్నారు.
మీడియా సమావేశంలో మాట్లాడుతూ బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు చూసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని.. గతంలోనూ విజయవంతంగా జట్టును నడిపించాడన్నారు. అతనికి ఏం కావాలో తెలుసునని.. బౌలింగ్‌లో ముందు నుంచి నాయకత్వం వహిస్తాడని.. అతన్ని యువ బౌలర్లు అనుసరిస్తారన్నారు. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లతో బుమ్రా సలహాలు అవసరమైన సలహాలు సూచనలు తీసుకోగలడని.. అది కెప్టెన్‌గా ముందుకు సాగడంలో సహాయపడుతుందని మోర్కెల్ పేర్కొన్నారు. బుమ్రాకు ఇది పెద్ద సవాల్ అని.. కోహ్లీ, రాహుల్ లాంటి అనుభవజ్ఞులు ఉన్నారన్నారు. ఆస్ట్రేలియా గడ్డపై బుమ్రాకు అద్భుతమైన రికార్డు ఉంది. ఏడు టెస్టు మ్యాచచుల్లో 32 వికెట్లు పడగొట్టాడు. 2018-19, 2020-21 పర్యటనల్లో విజయం సాధించిన తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు వరుసగా మూడో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.