IND vs AUS | నాగ్‌పూర్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్ దక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత జట్టు అదరగొట్టింది. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా గురువారం నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో రోహిత్ సేన దుమ్మురేపింది. మొదట బౌలర్లు సమిష్టిగా సత్తాచాటి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయగా.. అనంతరం రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు. తెలుగు ఆటగాడు కోన శ్రీకర్ భరత్ అరంగేట్రం.. పొట్టి ఫార్మాట్లో దంచికొడుతున్న సూర్యకుమార్ యాదవ్ తొలి టెస్టు చాన్స్ దక్కించుకోవడం లాంటి విశేషాలు నమోదైన ఈ పోరులో పలు రికార్డులు బద్దలయ్యాయి. అవేంటో ఓసారి చూద్దాం..
* నాగ్‌పూర్ టెస్టులో మూడు వికెట్లు పడగొట్టగడం ద్వారా భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు క్రికెట్లో 450 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ నుంచి ఈ ఫీట్ సాధించిన రెండో స్పిన్నర్‌గా అశ్విన్ రికార్డుల్లోకెక్కాడు. టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేకు ఈ ఫీట్ సాధించేందుకు 93 మ్యాచ్‌లు అవసరం కాగా.. 18 మ్యాచ్‌ల తర్వాత అశ్విన్ 89 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో ప్రపంచ క్రికెట్లో అతి తక్కువ మ్యాచ్‌ల్లో 450 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గానూ అశ్విన్ నిలిచాడు. శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్ 80 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు.
భారత్ తరఫున 400 అంతర్జాతీయ వికెట్లు (మూడు ఫార్మాట్లలో కలిపి) తీసిన తొమ్మిదో బౌలర్‌గా షమీ రికార్డుల్లోకెక్కాడు. తాజా టెస్టులో వార్నర్‌ను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా షమీ ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే (953 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత వరుసగా హర్భజన్ సింగ్ (707), కపిల్‌దేవ్ (687), అశ్విన్ (672*), జహీర్ ఖాన్ (597), జవగల్ శ్రీనాథ్ (551), రవీంద్ర జడేజా (482*), ఇషాంత్ శర్మ (434) ఉన్నారు. ప్రస్తుతం 400 వికెట్లతో షమీ తొమ్మిదో స్థానంలో నిలిచాడు.
30 ఏళ్లు దాటాక భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తొలి ఆటగాడిగా సూర్యకుమార్ అరుదైన గుర్తింపు సాధించాడు. ఐపీఎల్లో దంచికొట్టడంతో వెలుగులోకి వచ్చిన ఈ ముంబైకర్.. అనతి కాలంలోనే భారత్ తరఫున టీ20, వన్డే, టెస్టు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2021 మార్చి 14న 30 ఏళ్ల 181 రోజుల వయసులో భారత్ తరఫున తొలి టీ20 ఆడిన సూర్యకుమార్ 2021 జూలై 18న (30 ఏళ్ల 307 రోజుల వయసులో) మొదటి టెస్టు బరిలో దిగాడు. ఇక తాజా మ్యాచ్‌లో టెస్టుల్లో అరంగేట్రం (32 ఏళ్ల 148 రోజుల వయసులో) చేశాడు.