BCCI Rules | భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) ఇటీవల తీసుకువచ్చిన మార్గదర్శకాలు, ఫ్యామిలీ రూల్స్‌పై పునరాలోచన చేసే ఆలోచన ఏదీ లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఫ్యామిలీ రూల్‌పై ఇటీవల టీమిండియా సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ స్పందించిన విషయం తెలిసిందే. విరాట్‌కు మాజీ ఆటగాళ్లు సైతం మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే బీసీసీఐ ఫ్యామిలీ రూల్‌పై వెనక్కి తగ్గనుందనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో దేవజిత్ సైకియా మాట్లాడారు. బీసీసీఐ కొత్తగా పది పాయింట్లతో తీసుకువచ్చిన మార్గదర్శకాలతో పాటు విదేశీ పర్యటన సమయంలో ఫ్యామిలీ రూల్ విధానం మారమని చెప్పారు. ప్రస్తుత ఇదే విధానం కొనసాగుతుందన్నారు. ఇది దేశానికి, బీసీసీఐకి అత్యంత ముఖ్యమైందని పేర్కొన్నారు.
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టుల్లో ఘోర పరాజయం తర్వాత బీసీసీఐ పది పాయింట్లతో కొత్త మార్గదర్శకాలను అమలులోకి తెచ్చింది. 45 రోజుల కంటే తక్కువ నిడివి ఉండే టూర్లో కుటుంబ సభ్యులకు వారం రోజులే అనుమతి ఉంటుంది. ఇక 45 రోజుల కంటే ఎక్కువ రోజులు సాగే పర్యటనలో 14 రోజుల వరకే కుటుంబ సభ్యులకు అనుమతి ఉంటుంది. ఫ్యామిలీ రూల్‌పై టీమిండియా సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఘాటుగా స్పందించారు. బీసీసీఐ రూల్‌పై అసంతృప్తిని వెళ్లగక్కాడు. ఒత్తిడి సమయాల్లో విదేశీ పర్యటనల సమయంలో కుటుంబీకులు దగ్గరగా ఉంటే.. ప్లేయర్స్‌కు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. విదేశీ పర్యటనల్లో మ్యాచ్ ముగిశాక ఒంటరిగా గదుల్లో కూర్చొని విచారిస్తుండాలని.. దాని కంటే ఫ్యామిలీ ఉంటే నార్మల్ అయ్యే పరిస్థితి ఉంటుందని.. గేమ్‌ని ఓ రెస్పాన్సిబిలిటీగా చూసేందుకు, ఒత్తిడిని నుంచి బయటపడి మెంటల్‌గా స్ట్రాంగ్ అయ్యేందుకు ఉపయోగపడుతుందని చెప్పాడు. విరాట్ వ్యాఖ్యలకు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సైతం మద్దతు తెలిపాడు. సమస్యను పరిష్కరించేందుకు సమతుల్య విధానం అవసరమ.. బోర్డు నిర్ణయమే ప్రధానమని.. కుటుంబం అవసరమే అయినా.. జట్టు కూడా కీలకమేనన్నారు.
అయితే, దీనిసై సైకియా స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే హక్కు ఉంటుందన్నారు. ఈ విధానం జట్టు సభ్యులందరికీ, కోచ్‌లు, మేనేజర్లు, సపోర్టింగ్ స్టాఫ్ అందరికీ ఒక్కటేనన్నారు. అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రూల్స్‌ను అమలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విధానం కొత్తదేం కాదని.. అకస్మాత్తుగా ప్రవేశపెట్టలేదని బీసీసీఐ కార్యదర్శి స్పష్టం చేశారు. విధానాన్ని రాత్రికి రాత్రే రూపొందించలేదని.. దశాబ్దాలుగా అమలులో ఉందన్నారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ క్రికెట్ ఆడే రోజుల నుంచి.. అంతకు ముందు నుంచి అమలులో ఉందన్నారు. కొత్త విధానం.. గతంలోని దానికి సవరణ మాత్రమేనన్నారు. నిబంధనలన్నీ జట్టు సమన్వయం, ఐక్యతే లక్ష్యంగా తీసుకువచ్చినట్లు చెప్పారు. అయితే, ఏవైనా మార్పులు అధికారిక ప్రక్రియ ద్వారా మాత్రమే జరుగుతాయని, ప్రత్యేక పరిస్థితుల్లో నిబంధనలు సడలించే నిబంధన ఉందని.. కానీ, సరైన ప్రక్రియ ద్వారా మాత్రమే జరుగుతుందన్నారు.