Norway Chess : భారత గ్రాండ్‌మాస్టర్ డి.గుకేశ్(D.Gukesh) తన పుట్టినరోజు నాడే నార్వే చెస్(Norway Chess) టోర్నమెంట్లో బోణీ కొట్టాడు. వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ చేతిలో వరసగా ఓడిన ఈ వరల్డ్ ఛాంపియన్ గురువారం అదరగొట్టాడు. హోరాహోరీగా జరిగిన మూడో రౌండ్లో అమెరికాకు చెందిన హికరు నకముర( Hikaru Nakamura)ను చిత్తుగా ఓడించాడు గుకేశ్. తద్వారా మూడు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. ఈ టోర్నీలో జోరు మీదున్నమరో భారత ఆటగాడు అర్జున్ ఎరిగేసి(Arjun Erigaisi)కి తొలి పరాజయం ఎదురైంది.
గురువారం 19వ పడిలోకి అడుగుపెట్టిన గుకేశ్ తన తడాఖా చూపించాడు. మాగ్నసన్తో పోరులో ఒత్తిడికి లోనైన గుకేశ్ ఈసారి నకమురపై ఛాంపియన్ ఆటతో చెలరేగాడు. తెల్లపావులతో ఆడిన అతడు ప్రత్యర్థి వ్యూహాలను చిత్తు చేస్తూ వచ్చాడు. చివరకు 42వ ఎత్తులో నకముర చెక్ పెట్టాడు.
‘ఈ విజయంతో చాలా సంతోషంగా ఉన్నాను. గత మ్యాచుల్లో కంటే ఈ రోజు నా సమయపాలన బాగా పనికొచ్చింది. నకముర మ్యాచ్‌ను డ్రా చేసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ, అతడి వ్యూహాన్ని పసిగట్టి మ్యాచ్ ముగించాను. అందుకు చాలా హ్యాపీగా ఉన్నా’ అని గుకేశ్ తెలిపాడు. ఈ విజయంతో అతడు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకాడు.
నార్వే చెస్ టోర్నీలో అదిరే ఆరంభం చేసిన అర్జున్ ఎరిగేసి తొలి ఓటమి చవిచూశాడు. తెలంగాణ బిడ్డ అయిన అర్జున్ ఉత్కంఠ పోరులో ఫాబియనో కరౌనా (ఇటలీ) చేతిలో కంగుతిన్నాడు. దాంతో, ఆరు పాయింట్లతో కరౌనా అగ్రస్థానంలో నిలిచాడు. అర్జున్ 4.5 పాయింట్లతో మూడో ప్లేస్‌లో ఉన్నాడు.
🤯😱👌 #NorwayChess pic.twitter.com/PPXaG3V34k
— Norway Chess (@NorwayChess) May 29, 2025
చైనా క్రీడాకారుడు వియ్ ధాటికి ట్రై బ్రేక్‌లో చేతులెత్తేసిన మాగ్నస్ కార్ల్సన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మహిళల విభాగంలో కోనేరు హంపి జైత్రయాత్ర కొనసాగుతోంది. గురువారం తెల్లపావులతో ఆడిన ఆమె ఉక్రెయిన్ ప్లేయర్ అన్నా ముజిచుక్‌తో కలిసి సంయుక్తంగా నంబర్ 1 స్థానంలో నిలిచింది.