రాంచీ: విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy) వన్డే మ్యాచ్‌లో ఇవాళ బీహార్ జట్టు వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. లిస్ట్ ఏ మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్‌పై నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 574 రన్స్ చేసింది. లిస్ట్ ఏ మ్యాచుల్లో ఇదే అత్యధిక వన్డే స్కోరు కావడం విశేషం. గతంలో అరుణాచల్ జట్టుపైనే 2022లో తమిళనాడు 2 వికెట్లు కోల్పోయి 506 రన్స్ చేసింది. ఇప్పుడు ఆ స్కోరును బీహార్ జట్టు అధిగమించింది.
బీహార్ ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు నమోదు అయ్యాయి. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ చిచ్చరపిడుగులా రెచ్చిపోయాడు. అతను 84 బంతుల్లోనే 190 రన్స్ చేశాడు. దాంట్లో 15 సిక్సర్లు, 16 ఫోర్లు ఉన్నాయి. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన వైభవ్.. కేవలం 36 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అయితే తృటిలో అతను డబుల్ సెంచరీ మిస్సయ్యాడు. వైభవ్ ఇచ్చిన ఊపును మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కొనసాగించారు.
జట్టులోని ఆయుష్ లోహరుకా, సకీబుల్ ఘనిలు కూడా సెంచరీలతో హోరెత్తించారు. ఆయుష్ 56 బంతుల్లో 8 సిక్సర్లు, 11 ఫోర్లతో 116 రన్స్ స్కోరు చేశాడు. నాటౌట్‌గా నిలిచిన షకీబుల్ ఘని కూడా వైభవ్ తరహాలో చెలరేగిపోయాడు. భారీ స్ట్రోక్స్‌తో అలరించాడు. సకీబుల్ 40 బంతుల్లో 12 సిక్సర్లు, 10 ఫోర్లతో 128 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.