టీమిండియా పరిమిత ఓవర్ల సారధిగా పగ్గాలు అందుకున్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మపై మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీతో పోల్చుకుంటే రోహిత్ కెప్టెన్సీ విధానం కొంత సరళంగా ఉంటుందని అగార్కర్ అభిప్రాయపడ్డాడు. అయితే రోహిత్ నాయకత్వ లక్షణాలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయన్నాడు.
రోహిత్ వద్ద చాలా అనుభవం ఉందని, అంతర్జాతీయ క్రికెట్లో చాలా మ్యాచులు ఆడాడని చెప్పాడు. ‘తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఒక సిరీస్‌కో లేక కొన్ని మ్యాచులకో సారధ్యం వహిస్తాం. కానీ ఇప్పుడు వచ్చే ప్రపంచకప్ కోసం జట్టును సిద్ధం చేయాలి. అది టీ20 లేదా వన్డే ప్రపంచకప్ ఏదైనా సరే.. ఇప్పుడు జట్టును తయారు చేసే బాధ్యత ఉంటుంది’ అని అగార్కర్ వివరించాడు.
అలాగే రోహిత్ శర్మ ముందు ఉండే అతిపెద్ద సవాల్ ఫిట్నెస్ అని చెప్పాడు. ‘కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం. రోహిత్ శర్మకు గాయాలయ్యాయి. అతని కన్నా ముందు ఉన్న కెప్టెన్లు కోహ్లీ, ధోని ఇద్దరి బలం ఫిట్‌గా ఉండటమే. వాళ్ల కెరీర్లో చాలా తక్కువ మ్యాచులే మిస్సయ్యారు’ అని పేర్కొన్నాడు. అదే రోహిత్‌కు సవాల్‌గా మారుతుందని, జట్టు ఆడే అన్ని మ్యాచులు రోహిత్ ఆడాల్సి ఉంటుందని వెల్లడించాడు. అప్పుడే జట్టను నిర్మించడం సులభంగా ఉంటుదని, లేదంటే కష్టంగా మారుతుందన్నాడు.