మొత్తం 204 స్లాట్స్ కోసం 577 మంది క్రికెటర్లు తమ పేర్లు నమోదుచేసుకోగా రెండు రోజుల్లో 182 మంది ప్లేయర్ల (62 మంది ఓవర్సీస్ ఆటగాళ్లు)ను పది ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. వీరిపై ఆయా జట్లు కలిసి ఖర్చు చేసిన మొత్తం రూ. 639.15 కోట్లు.
IPL | జెడ్డా: తొలి రోజు మాదిరిగానే రెండో రోజూ ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు కీలక ఆటగాళ్లపై కాసులు కుమ్మరించాయి. భారత వెటరన్ పేసర్, గత సీజన్ దాకా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన భువనేశ్వర్ కుమార్ రెండో రోజు వేలంలో అత్యధిక ధరను దక్కించుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అతడిని రూ. 10.75 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. రెండో రోజు రూ. 10 కోట్ల మార్కును దాటిన ఏకైక క్రికెటర్ భువీనే. అతడితో పాటు టీమ్ఇండియా బౌలర్లు దీపక్ చాహర్ (రూ. 9.25 కోట్లు – ముంబై), ముకేశ్ కుమార్ (రూ. 8 కోట్లు- ఢిల్లీ), ఆకాశ్ దీప్ (రూ. 8 కోట్లు- లక్నో) భారీ ధర పలికారు.
ఎవరూ ఊహించని విధంగా సౌతాఫ్రికా పేస్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ను పంజాబ్ కింగ్స్ రూ. 7 కోట్ల ధరతో దక్కించుకోగా ముంబై పేసర్ తుషార్ దేశ్‌పాండే కోసం రాజస్థాన్ 6.50 కోట్లు వెచ్చించింది. ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాను రూ. 5.75 కోట్లతో ఆర్సీబీ సొంతం చేసుకోగా కేకేఆర్ మాజీ స్పిన్ ఆల్‌రౌండర్ నితీశ్ రాణాను రాజస్థాన్ రూ. 4.20 కోట్లకు కొనుగోలు చేసింది. వాషింగ్టన్ సుందర్ రూ. 3.20 కోట్లతో గుజరాత్ తీసుకుంది. ఆక్షన్ తొలి రోజు అమ్ముడుపోని డేవిడ్ వార్నర్‌ను రెండో రోజూ ఫ్రాంచైజీలు పట్టించుకోకపోగా దేవ్‌దత్ పడిక్కల్ ఎట్టకేలకు తిరిగి ఆర్సీబీ గూటికి (రూ. 2 కోట్లు) చేరాడు.
2009లో ఆర్సీబీ తరఫునే (చాంపియన్స్ లీగ్) ఎంట్రీ ఇచ్చిన భువీని తిరిగి సొంతగూటికి చేర్చుకునేందుకు బెంగళూరు చాకచక్యంగా వ్యవహరించింది. రూ. 30.65 కోట్ల భారీ పర్స్‌తో రెండో రోజు వేలంలోకి వచ్చిన ఆర్సీబీ.. ఆరంభంలో భువీని పట్టించుకోలేదు. సన్‌రైజర్స్ వద్దనుకున్న భువీ కోసం ముంబై, లక్నో పోటీ పడ్డాయి. కానీ అనూహ్యంగా రేసులోకి వచ్చిన బెంగళూరు.. భారీ ధరకు అతడిని దక్కించుకుంది.
కొద్దిరోజుల క్రితం ముగిసిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో మెరుపులు మెరిపించిన యువ సంచలనం ప్రియాన్షు ఆర్య కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అలవోకగా సిక్సర్లు బాదే ఈ కుర్రాడి కోసం ఆర్సీబీ, ఢిల్లీ, పంజాబ్ పోటాపోటీగా బిడ్ వేశాయి. కానీ చివరికి పంజాబ్.. రూ. 3.6 కోట్ల ధరతో అతడిని దక్కించుకుంది.
ఎవరూ ఊహించని విధంగా బీహార్‌కు చెందిన 13 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ.. వేలంలో రూ. 1.10 కోట్లు దక్కించుకున్నాడు. 13 ఏండ్ల 243 రోజుల వయసున్న వైభవ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని చివరికి రాజస్థాన్ సొంతం చేసుకుంది. కొద్దిరోజుల క్రితమే చెన్నై వేదికగా ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన యూత్ టెస్టులో వైభవ్.. 62 బంతుల్లోనే శతకం బాది అంతర్జాతీయ స్థాయిలో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు.