INDW vs AUSW : మూడు వన్డేల సిరీస్ ఆఖరి పోరులో ఆస్ట్రేలియా మహిళల జట్టు కొండంత స్కోర్ చేసింది. భారత బౌలర్లను ముప్పతిప్పలు పెడుతూ జార్జియా వొల్(81), ఎలీసా పెర్రీ(68) హాఫ్ సెంచరీతో మెరవగా.. బేత్ మూనీ(138) విధ్వసంక శతకంతో రెచ్చిపోయింది. ఆమె జోరు చూస్తే.. ఆసీస్ జట్టు సులువగా 430 ప్లస్ కొట్టేలా కనిపించింది. కానీ, చివర్లో అరుంధతి రెడ్డి (3-86), దీప్తి శర్మ(2-72)లు కట్టడి చేయడంతో 412 పరుగులతో ఆగిపోయింది. వన్డే చరిత్రలో భారత జట్టుపై అత్యధిక స్కోర్ నమోదు చేసింది.
సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో భారత బౌలర్లు తేలిపోయారు. ఆస్ట్రేలియా బ్యాటర్లను నిలువరించడంలో దారుణంగా విఫలమ్యారు. దాంతో.. ఆరంభం నుంచి టాప్ గేర్‌లో ఆడిన ఆసీస్ బ్యాటర్లు జార్జియా వొల్(81), ఎలీసా పెర్రీ(68)లు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇద్దరూ వెనుదిరగగా.. బేత్ మూనీ(138 75 బంతుల్లో 23 ఫోర్లు, ఒక సిక్సర్) తన విధ్వంసక బ్యాటింగ్‌తో బౌలర్లను వణికించింది. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి తరలించిన మూనీ 57 బంతుల్లోనే శతకం బాదింది. సెంచరీ తర్వాత మరింత దూకుడు పెంచిన ఆమె.. అషే గార్డ్నర్(39), తహ్లియా మెక్‌గ్రాత్(14)తో విలువైన పరుగులు జోడించి జట్టు స్కోర్ 350 దాటించింది.
The joint-second quickest in women’s ODIs 💥
Take a bow, Beth Mooney! https://t.co/EoovVU5pgr | #INDvAUS pic.twitter.com/dY9FJlT7g2
— ESPNcricinfo (@ESPNcricinfo) September 20, 2025
అయితే.. 44వ ఓవర్లో సింగిల్ తీయబోయి మూనీ రనౌట్ అయింది. దాంతో.. భారత బౌలర్లు ఊపిరిపీల్చుకున్నారు. అక్కడి నుంచి లోయర్ ఆర్డర్ ఇలా వచ్చి అలా పెవిలియన్ వెళ్లారు. రేణుకా ఓవర్లో జార్జియా వరేహం (16) ఫోర్, సిక్స్ బాదగా.. అలనా కింగ్(12)లు ధనాధన్ ఆడారు. కానీ, అరుంధతి ఓవర్లో పెద్ద షాట్ ఆడబోయిన అలనా బౌండరీ వద్ద స్నేహ్ రానా చేతికి చిక్కింది. దాంతో.. 412 ఓవర్ల వద్ద ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది.