బెంగళూరు: సారథుల సమరంలో బెంగళూరుదే పైచేయి అయింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో బెంగళూరు బుల్స్ 36-35తో బెంగాల్ వారియర్స్‌పై విజయం సాధించింది. బెంగళూరు కెప్టెన్ పవన్ షెరావత్ 15 పాయింట్లతో విజృంభిస్తే.. బెంగాల్ వారియర్స్ నాయకుడు మణిందర్ సింగ్ 17 పాయింట్లతో విశ్వరూపం కనబర్చాడు. వీరిద్దరి మధ్య ఆదిపత్య పోరుతో మ్యాచ్ హోరాహోరీగా సాగగా.. ఆఖరికి బెంగళూరు బుల్స్‌ను విజయం వరించింది. బెంగళూరు తరఫున పవన్‌తో పాటు చంద్రన్ రంజిత్ (6 పాయింట్లు) రాణించగా.. బెంగాల్ తరఫున మహమ్మద్ నబీబక్ష్ (8 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో బెంగళూరుకు ఇది రెండో విజయం కాగా.. బెంగాల్ వారియర్స్‌కు తొలి పరాజయం. గుజరాత్ జెయింట్స్, దబంగ్ ఢిల్లీ మధ్య జరిగిన మరో మ్యాచ్ 24-24తో ‘డ్రా’గా ముగిసింది.