WPL 2024 | మహిళల ప్రీమియర్ లీగ్ -2024 టోర్నీలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్దేశించిన 199 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించడంలో యూపీ వారియర్స్ జట్టు చేతులెత్తేసింది. యూపీ వారియర్స్ కెప్టెన్ హల్యేసా హీలే ఓపెనర్ గా 55 పరుగులు, దీప్తీ శర్మ 33, పూనం ఖేమ్మార్ 31 పరుగులతో పర్వాలేదనిపించినా మిగతా వారెవ్వరూ క్రీజులో నిలకడగా నిలబడలేకపోయారు. నిర్దేశిత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సోఫీ డివైన్, సోఫీ మోలిన్యూయెక్స్, జార్జియా వార్ హామ్, ఆశా శోభన రెండేసి వికెట్లు తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు నిర్దేశిత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. సబ్బినేని మేఘనతో కలిసి ఓపెనింగ్‌కు వచ్చిన స్మృతి మందాన ధాటిగా బ్యాటింగ్ చేశారు. సబ్బినేని మేఘన 28 పరుగులకే పెవిలియన్ దారి పట్టినా, వన్ డౌన్ బ్యాటర్ ఎల్లిసే పెర్రీతో కలిసి మందాన దూకుడుగా బ్యాటింగ్ చేశారు. మందాన 80, పెర్రీ 58 పరుగులు చేశారు. రిషా ఘోష్ 21 పరుగులు, సోఫీ డివైన్ రెండు పరుగులతో నాటౌట్ గా నిలిచారు. యూపీ వారియర్స్ బౌలర్లలో అంజలీ శార్వాణి, దీప్తి శర్మ, సోఫీ ఎస్సెల్ స్టోన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.