న్యూఢిల్లీ: అండర్-19 ఆసియా కప్ టోర్నీకి బీసీసీఐ యువ భారత జట్టును ఎంపిక చేసింది. శుక్రవారం 15 మందితో ప్రకటించిన జట్టులో హైదరాబాద్ యువ క్రికెటర్ ఆరోన్ జార్జ్ చోటు దక్కించుకున్నాడు. దుబాయ్ వేదికగా వచ్చే నెల 12 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న వన్డే టోర్నీలో భారత అండర్-19 జట్టుకు ఆరోన్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. జింబాబ్వే, నమీబియా వేదికలుగా వచ్చే ఏడాది జనవరిలో జరిగే ప్రతిష్టాత్మక అండర్-19 ప్రపంచకప్ టోర్నీకి ఆసియా కప్‌ను సన్నాహకంగా భావిస్తున్నారు.
దేశవాళీతో పాటు ఐపీఎల్లో మెరుపులు మెరిపిస్తున్న ముంబై యువ సంచలనం ఆయూశ్ మాత్రె..యువ భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, విహాన్ మల్హోత్ర వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇటీవలి రైజింగ్స్టార్స్ ఆసియాకప్‌లో మెరుపులు మెరిపించిన బీహార్ యంగ్ తరంగ్ వైభవ్ సూర్యవంశీ జట్టుకు ఎంపికయ్యాడు. 32 బంతుల్లోనే సెంచరీ కొట్టి టీ20 ఫార్మాట్లో మూడో వేగవంతమైన శతక రికార్డును వైభవ్ తన పేరిట లిఖించుకున్నాడు. కిషన్కుమార్సింగ్ ఫిట్నెస్ను బట్టి జట్టులోకి తీసుకుంటామని బీసీసీఐ పేర్కొంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూపులో ఉండగా, మిగిలిన రెండు జట్లు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
జట్టు వివరాలు: ఆయూశ్ మాత్రె(కెప్టెన్), ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్ర, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు, హర్వంశ్సింగ్, యువరాజ్, కనిశ్క్ చౌహాన్, కిలాన్, నమన్ పుష్పక్, దీపేశ్, హెనిల్ పటేల్, కిషన్‌కుమార్, ఉద్బవ్ మోహన్. స్టాండ్‌బై ప్లేయర్లు: రాహుల్‌కుమార్, హేమ్చూడెశన్, కిషోర్, ఆదిత్యరావత్.
హైదరాబాద్ యువ క్రికెటర్ ఆరోన్ జార్జ్ వర్గీస్ అంచలంచెలుగా ఎదుగుతున్నాడు. ఇటీవలే వినుమన్కడ్ ట్రోఫీలో హైదరాబాద్ టైటిల్ విజేతగా నిలువడంలో కీలకంగా వ్యవహరించిన ఆరోన్..తాజాగా ఆసియా కప్ అండర్-19 టోర్నీలో భారత జట్టుకు ఎంపికయ్యాడు. ‘మిస్టర్ 360’ఏబీ డివిలీయర్స్ ఆటను పోలి ఉండే ఆరోన్ తనదైన శైలిలో దూసుకెళుతున్నాడు. 1937-38, 1986-87 హైదరాబాద్‌కు రంజీ ట్రోఫీ విజయాల తర్వాత వినుమన్కడ్ టైటిల్‌ను అందజేసిన ఆరోన్ ప్రస్తుతం ముక్కోణపు సిరీస్‌లో భారత ‘బీ’ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. వినుమన్కడ్ ట్రోఫీ గత రెండు సీజన్లలో హైదరాబాద్ తరఫున వరుసగా 341, 373 పరుగులు సాధించిన ఆరోన్..కెప్టెన్‌గాను జట్టును ముందుండి నడిపించాడు. బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ(303) చేయడం ద్వారా సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.
సచిన్ టెండూల్కర్‌తో పాటు ఏబీ డివిలీయర్స్ను ఆరాధించే ఆరోన్ దూకుడుగా ఆడటంలో సిద్ధహస్తుడు. పిచ్‌పై బంతి ఎక్కడా పడ్డా దాన్ని అంతే చాకచక్యంగా షాట్‌గా మలువడంలో ఆరోన్ ఆరితేరాడు. కొట్టాయం(కేరళ) నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డ అతని కుటుంబం అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎసో వర్గీస్, ప్రీతి..ఆరోన్ ఎదుగుదల పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. లీగ్ క్రికెట్ ఆడిన ఎసోకు తగిన మద్దతు లేకపోవడంతో కెరీర్‌ను కొనసాగించలేకపోయాడు. జాతీయ జట్టుకు ఆడాలన్న ఆశయాన్ని కొడుకులో చూసుకోవాలనుకున్న ఎసో వర్గీస్..ఆరోన్ కోసం తన ఉద్యోగాన్ని మార్చుకున్నాడు. బంతి గమనాన్ని బట్టి చేయడంలో ఆరోన్ మెరుగైన పరిణతి కనబరుస్తున్నాడని తండ్రి చెప్పుకొచ్చాడు.