BCCI | దాదాపు 12 సంవత్సరాల తర్వాత టీమిండియా మరోసారి చాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సహా పలువురు జట్టు సభ్యులు స్వదేశానికి తిరిగి వచ్చారు. సోమవారం రాత్రి రోహిత్ ముంబయికి చేరుకున్నాడు. జట్టు సభ్యులు దేశంలోని వివిధ నగరాలకు వెళ్లారు. అయితే, టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన సందర్భంలో బీసీసీఐ ఆటగాళ్లను సత్కరించిన విషయం తెలిసిందే. మరి చాంపియన్స్ ట్రోఫీని నెగ్గిన జట్టును ఎందుకు సన్మానించలేదనే అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై బీసీసీఐ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. చాలా మంది ఆటగాళ్లు.. కుటుంబాలతో దుబాయిలోనే ఉన్నారు. భారత్ విజేతగా నిలిచిన అనంతరం పలువురు ఆటగాళ్లు ముందుగానే బయలుదేరగా.. మరికొందరు ఆలస్యంగా స్వదేశానికి వచ్చారు. గంభీర్, ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా సోమవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఆదివారమే భార్య అనుష్క శర్మతో కలిసి దుబాయిలోని హోటల్ నుంచి బయలుదేరి వెళ్లాడు.
శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ కోసం పంజాబ్ జట్టులో చేరనున్నాడు. ఈసారి పంజాబ్‌కు అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి 12 సంవత్సరాల తర్వాత భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. భారత్ అన్ని మ్యాచులను హైబ్రిడ్ మోడల్లో దుబాయ్‌లో ఆడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు నెలల పాటు కొనసాగనున్నది. ఈ క్రమంలో ఆటగాళ్లు విశ్రాంతికి ప్రాధాన్యం ఇచ్చారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత జట్టు స్వదేశానికి వచ్చిన సమయంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. వెస్టిండిస్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చిన భారత జట్టు ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఆ తర్వాత ముంబయికి చేరుకొని.. ఓపెన్ టాప్ బస్సులో విజయయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత వాంఖడే స్టేడియంలో బీసీసీఐ సన్మానం నిర్వహించింది. అయితే, చాంపియన్స్ ట్రోఫీని గెలిచిన సందర్భంగా సన్మానం చేయలేదు. ఈ విషయంలో బీసీసీఐ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.