IPL Ticket Price | భారత జట్టు జెర్సీ స్పాన్సర్‌ను రాబోయే రెండు మూడు వారాల్లో నిర్ణయిస్తామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా శనివారం తెలిపారు. బిడ్డింగ్ సెప్టెంబర్ 16న ముగుస్తుందని వెల్లడించారు. ఆన్లైన్ గేమింగ్ కంపెనీ డ్రీమ్ 11 బీసీసీఐతో ఒప్పందాన్ని ఇటీవల రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో భారత జట్టు స్పాన్సర్ లేకుండానే ఈ సారి ఆసియా కప్‌లో ఆడనున్నది. ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్లు-2025 నేపథ్యంలో కంపెనీ కార్యకలాపాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలోనే ఒప్పందం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నది. ఆ తర్వాత బీసీసీఐ జట్టు టైటిల్ స్పాన్సర్షిప్ హక్కుల కోసం బిడ్లను ఆహ్వానించింది.
ఈ సందర్భంగా రాజీవ్ శుక్లా మాట్లాడుతూ ప్రస్తుతానికి ఎవరినీ నిర్ణయించలేదన్నారు. తుది నిర్ణయం తర్వాత తెలియజేనున్నట్లు పేర్కొన్నారు. ఐపీఎల్ టికెట్లపై జీఎస్టీ పెంపుపై సైతం ఆయన స్పందించారు. ఐపీఎల్ టికెట్లపై జీఎస్టీ 40 శాతం స్లాబ్‌లోకి వచ్చింది. భారత ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ స్లాబ్‌ను మార్చింది. ఐపీఎల్ టిక్కెట్లపై జీఎస్టీ పెరుగుదల కారణంగా రూ. 500 టికెట్ ధర ఇప్పుడు రూ. 700 కాగా.. రూ. 2000 టికెట్ ధర రూ. 2800 అవుతుంది. అయితే, అంతర్జాతీయ, దేశీయ మ్యాచ్‌లపై జీఎస్టీ 18శాతం వర్తించనుంది. ఈ క్రమంలో రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. చాలా మంది సాధారణ పౌరులు ఐపీఎల్ చూడటానికి వస్తారని నాకు తెలుసునని.. స్పష్టంగా దాని ప్రభావం ఉంటుందన్నారు.
కానీ, ప్రజలు ఐపీఎల్ మ్యాచ్‌లను చూడటానికి వస్తారని తాను ఇప్పటికీ ఆశిస్తున్నాని తెలిపారు. బీసీసీఐకి పన్ను మినహాయింపుపై వచ్చిన విమర్శలపై శుక్లా మాట్లాడుతూ ప్రతి కార్పొరేట్ కంపెనీలాగే బీసీసీఐ ఆదాయపు పన్ను చెల్లిస్తుందని.. జీఎస్టీని కూడా చెల్లిస్తుందన్నారు. మాకు ఎలాంటి మినహాయింపు లేదని.. తాము వేల రూ.కోట్ల పన్ను చెల్లిస్తామన్నారు. రాష్ట్ర క్రికెట్ సంఘాలు కూడా పన్ను చెల్లిస్తాయని.. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం తీసుకోవడం లేదన్నారు. మహిళల క్రికెట్ అభివృద్ధికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. స్టేడియాలు నిండడమే సవాల్ అన్నారు. తమ వైపు నుంచి అన్నీ చేస్తున్నామని.. జీతం జీతం కూడా సమానమైందన్నారు. మహిళలను ప్రోత్సహిస్తున్నామని.. టోర్నీలు సైతం నిర్వహిస్తున్నామని.. సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రేక్షకులు మ్యాచ్‌లను చూసేందుకు రావాలన్నారు.