లండన్: సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు కుదుపునకు లోనైంది. పటిష్ఠమైన బయోబబుల్ వాతావరణంలో సాగుతున్న సిరీస్‌లో టీమ్ఇండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి, భరత్ అరుణ్, ఆర్ శ్రీధర్‌కు కరోనా వైరస్ సోకడం అందరినీ ఒకింత ఆందోళనకు గురి చేసింది. నాలుగో టెస్టుకు ముందు ఏర్పాటు చేసిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమం వైరస్ వ్యాప్తికి కారణమైందని తేలింది. దీనికి కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు జట్టు సభ్యులు, సహాయక బృందం హాజరయ్యారు. స్థానిక హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవిశాస్త్రి, భరత్ అరుణ్, శ్రీధర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, ఫిజియో నితిన్ పటేల్ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఇదిలా ఉంటే కట్టుదిట్టమైన ఏర్పాట్లను ఉల్లంఘిస్తూ తమ అనుమతి లేకుండా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల బీసీసీఐ గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించే అవకాశమున్నట్లు బోర్డు వర్గాల సమాచారం.
ముఖ్యంగా కోచ్ రవి, కెప్టెన్ కోహ్లీ నుంచి వివరణ తీసుకోనేందుకు బీసీసీఐ సిద్ధమైంది. దీనికి తోడు జట్టు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గిరీశ్ డోంగ్రె పాత్ర కూడా పరిశీలనలో ఉన్నట్లు బోర్డు అధికారి ఒకరు మంగళవారం పేర్కొన్నారు. సిరీస్ ప్రారంభానికి ముందు కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ బోర్డు కార్యదర్శి జైషా జట్టులోని ప్లేయర్లు, సహాయక సిబ్బందికి వ్యక్తిగతంగా లేఖలు రాసినా ఇలా జరుగడంపై బీసీసీఐ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) అనుమతి లేనట్లు తెలిసింది. మరోవైపు టీమ్ఇండియాలో కరోనా కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ఈనెల 10న మాంచెస్టర్‌లో మొదలయ్యే ఐదో టెస్టు కోసం ఈసీబీ పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నది. ఇక దుబాయ్, ఒమన్ వేదికగా వచ్చే నెలలో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం బుధవారం భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేయనుంది.