Batting Coach | గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత గౌతమ్ గంభీర్ హెడ్‌కోచ్‌గా నియామకమయ్యాడు. ఆ తర్వాత బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ బాధ్యతలు తీసుకోగా.. అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోషేట్ను అసిస్టెంట్ కోచ్‌లుగా బీసీసీఐ నియమించింది. ప్రస్తుతం టీమిండియాకు బ్యాటింగ్ కోచ్ అందుబాటులో లేడు. ఈ క్రమంలో బీసీసీఐ కొత్త బ్యాటింగ్ కోచ్‌ను నియమించాలని పరిశీలిస్తున్నది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ దిగ్గజం కెవిన్ పీటర్సన్ భారత జట్టుకు బ్యాటింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తిని చూపారు. వాస్తవానికి గౌతమ్ గంభీర్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి టీమిండియా ప్రదర్శన ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఒక టీ20 సిరీస్, ఒక వన్డే సిరీస్, రెండు మూడు టెస్టు సిరీస్‌లను ఆడింది.
స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల్లో ఓటమిపాలైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలోనూ సిరీస్‌ను కోల్పోయింది. శ్రీలంకలో జరిగిన వన్డే సిరీస్‌లో ఓటమి మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు బ్యాటింగ్ కోచ్‌ను నియమించేందుకు సన్నద్ధమవుతుందని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే ఓ ట్వీట్‌ను కెవిన్ పీటర్సన్ రీ ట్వీట్ చేస్తూ.. అందుబాటులో ఉన్నానంటూ స్పందించారు. ఇదిలా ఉండగా.. బీసీసీఐ సితాన్షు కొటక్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించేందుకు అవకాశం ఉందని ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది. సీతాన్షు ప్రస్తుతం ఇండియా ఏ జట్టు హెడ్‌కోచ్‌గా కొనసాగుతున్నాడు. ఆయన పర్యవేక్షణలోనే ఇండియా ఏ జట్టు ఆస్ట్రేలియా పర్యటించింది. 2023 ఆగస్టులో టీమిండియా ఐర్లాండ్ పర్యటన సమయంలో రాహుల్ ద్రవిడ్ గైర్హాజరీలో సితాన్షు హెడ్‌కోచ్‌గా వ్యవహరించారు. ఈ సిరీస్‌లో బుమ్రా జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు.