ఢిల్లీ: పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ క్రికెట్లో సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకనున్నాడా? ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన కోహ్లీ.. టెస్టుల నుంచీ తప్పుకునేందుకు సిద్ధమయ్యాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇటీవలే సారథ్య బాధ్యతలతో పాటు టెస్టులకూ వీడ్కోలు పలికిన మాజీ సారథి రోహిత్ శర్మ బాటలోనే కోహ్లీ సైతం టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నాడు. ఈ మేరకు కోహ్లీ ఇదివరకే ఈ విషయాన్ని బీసీసీఐకి తెలిపినట్టు బోర్డు వర్గాల సమాచారం.
ఇంగ్లండ్ సిరీస్ కంటే ముందే దీనిపై కోహ్లీ ప్రకటన చేసే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. జనవరిలో ఆస్ట్రేలియాతో ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా కోహ్లీ పలుమార్లు ఈ విషయాన్ని టీమ్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొచ్చినట్టు వినికిడి. అయితే కీలకమైన ఇంగ్లండ్ పర్యటనకు ముందు బీసీసీఐ.. కోహ్లీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటుందా? లేక విరాట్ మనసు మార్చుతుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇదివరకే రోహిత్ రూపంలో అత్యంత అనుభవజ్ఞుడిని కోల్పోయిన యంగ్ టీమ్ఇండియా.. ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ గైర్హాజరీని తట్టుకుని నిలబడుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అభిమానులు సైతం రిటైర్మెంట్ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోహ్లీతో పాటు ఆ దిశగా అతడిని ఒప్పించాలని బీసీసీఐని అభ్యర్థిస్తున్నారు.
ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టును ఈనెల 23న ప్రకటించనున్నట్టు బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్నది. అదే తేదీన కొత్త సారథితో పాటు జట్టునూ వెల్లడిస్తారని సమాచారం. రోహిత్ స్థానంలో శుభ్‌మన్ గిల్ భారత జట్టును నడిపించడం ఖాయంగా కనిపిస్తున్నది.