IPL 2025 : టీ20ల తలరాతను మార్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరో సీజన్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆలోపే మెగా వేలం కూడా ఉండడంతో కోట్లు కొల్లగొట్టేది ఎవరు? అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇక ఫ్రాంచైజీల విషయానికొస్తే.. ఎవరిని వదిలేయాలి? ఎవరెవరిని అట్టిపెట్టుకోవాలి? అనే దానిపై భారీ కసరత్తులు చేస్తున్నాయి. వివాదాస్పదంగా మారిన ‘ఇంప్యాక్ట్ ప్లేయర్’ (Impact Player) నిబంధనను ఎత్తేస్తారా? ఉంచుతారా? అనే విషయమై సర్వత్రా చర్చ నడుస్తోంది.
అంతేకాదు రెండు బౌన్సర్ల నియమంపై కూడా బీసీసీఐ (BCCI) ఏం నిర్ణయం తీసుకోనుంది? అనేది తెలియడం లేదు. ఐపీఎల్‌కు ‘ఇంప్యాక్ట్ ప్లేయర్’నిబంధన ఎంత క్రేజ్ తెచ్చిందో చూశాం. అయితే.. 16వ సీజన్లో ప్రవేశపెట్టిన ఈ నిబంధన వివిదాస్పదమైంది. ఇంపాక్ట్ రూల్ ఆల్‌రౌండర్ల కొంపముంచుతుంది? అంటూ పలువురు సీనియర్లు బీసీసీఐని విమర్శించారు. ఇక ఒకే ఓవర్లో రెండు బౌన్సర్ల విషయానికొస్తే.. ఇది బౌలర్ల పాలిట వరం. ఈ నియమంపై మాత్రం క్రికెటర్ల నుంచి ఫిర్యాదులు అందలేదు.
కానీ, అంతర్జాతీయ క్రికెట్లో లేని ఈ నియమం మనకు అవసరమా? అని కొందరి వాదన. దాంతో,ఈ రెండు నియమాలను ఉంచాలా? రద్దు చేయాలా? అని బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. దాంతో, 18వ సీజన్ వేలం లోపు బీసీసీఐ ఏం చెబుతుంది? అనేది అటు ఫ్రాంచైజీలతో పాటు అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. రెండు బౌన్సర్ల రూల్ అనేది దేశవాలీ టీ20 లీగ్ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇప్పటికీ కొనసాగుతోంది.
రోహిత్ శర్మ, మిచెల్ స్టార్క్
ప్రతి మూడేండ్లకు ఓసారి ఐపీఎల్ మెగా వేలం నిర్వహించడం పరిపాటి. 2022లో మెగా వేలం ముగిసి మూడేండ్లు కావొస్తోంది. అందుకని 2025 ఆరంభంలో మెగా వేలానికి బీసీసీఐ సిద్ధమవుతోంది. ఆలోపు ఫ్రాంచైజీలు తాము రీటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ఇవ్వాల్సి ఉంటుంది. నిరుడు మినీ వేలంలో మిచెల్ స్టార్క్(Mitchell Starc) రూ.24.75 కోట్లతో రికార్డులు బ్రేక్ చేశాడు. ఈసారి భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Roht Sharma) గనుక వేలానికొస్తే.. ఏకంగా రూ.50 కోట్లు పలుకుతాడని విశ్లేషకుల అంచనా.