AP News | గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడులో తీవ్ర విషాదం నెలకొంది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరద ఉధృతి కారణంగా మురుగు వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో టీచర్ సహా ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మృతులను రాఘవేంద్ర, సాత్విక్, మాన్విక్గా గుర్తించారు. భారీ వర్షాల కారణంగా పాఠశాలకు సెలవు ఇవ్వడంతో ఇద్దరు పిల్లలను ఇంటికి తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలయమై చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. సీఎం ఆదేశాల మేరకు విశాఖ, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, కోనసీమ, కృష్ణా, కాకినాడ, అల్లూరి మన్యం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
ఇక భారీ వర్షాల కారణంగా విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురిని మేఘన (25), లక్ష్మీ (49), అన్నపూర్ణ (55)గా గుర్తించారు. మరో మృతుడిని కోల్కతాకు చెందిన కార్మికుడిగా అనుమానిస్తున్నారు.