BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం మెన్స్, వుమెన్స్ జాతీయ సెలక్షన్ కమిటీల్లోని ఖాళీగా ఉన్న సభ్యుల పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీలో ఇద్దరు సభ్యులు, మహిళల సెలక్షన్ కమిటీలో నాలుగు పదవులను భర్తీ చేయనున్నది. ఆసక్తి ఉన్న వారు సెప్టెంబర్ 10వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలని బీసీసీఐ కోరింది. గతంలో ఉన్న అర్హత ప్రమాణాలు ఉంటాయని బీసీసీఐ స్పష్టం చేసింది. కనీసం ఏడు టెస్టు మ్యాచ్‌లు.. లేకపోతే 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచులు ఆడిన అనుభవం ఉండాలని పేర్కొంది. ప్రత్యామ్నాయంగా కనీసం పది వన్డే ఇంటర్నేషనల్స్, లేకపోతే 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఎంపికైన సెలక్టర్ల ఒప్పందం ప్రతి సంవత్సరం పునరుద్ధరించనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఉన్న సెలెక్టర్లలో ఎవరిని భర్తీ చేయాలో ఇంకా నిర్ణయించలేదని.. ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని ఓ బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
ఇటీవల ఆసియా కప్ కోసం జట్టును ఎంపిక చేసిన ప్రస్తుత పరుషుల సెలక్షన్ కమిటీకి మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు కమిటీలో ఎస్ఎస్ దాస్, సుబ్రతో బెనర్జీ, అజయ్ రాత్రా, ఎస్ శరత్ సభ్యులుగా ఉన్నారు. అలాగే, పురుషుల జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీలో ఒక సభ్యుడి కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ కమిటీ అండర్-22 వరకు వయస్సు గల జట్లకు క్యాంపులు, పర్యటనలు, టోర్నమెంట్లను టీమ్‌ను ఎంపిక చేస్తుంది. మహిళల జాతీయ సెలక్షన్ కమిటీలో నాలుగు పదవులకు దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రస్తుత మహిళా ప్యానెల్‌కు నీతు డేవిడ్ నేతృత్వం వహిస్తున్నారు. ఆమెతో పాటు రేణు మార్గరెట్, ఆర్తి వైద్య, కల్పనా వెంకటాచర్, శ్యామా డీ షా ఉన్నారు. ఈ కమిటీ ఇటీవల స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచ కప్ కోసం భారత మహిళా జట్టును కూడా ఎంపిక చేసింది.
అయితే, ఇటీవల పలు నివేదికలు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని జూన్ 2026 వరకు పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. భారత జట్టు సాధించిన విషయాలను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అగార్కర్ జూలై 2023లో సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన పదవీకాలంలో టీమిండియా పలు అద్భుత విజయాలను సాధించింది. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ వరకు వెళ్లింది. 2024 టీ20 ప్రపంచ కప్ టైటిల్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది.