BCCI | ముంబై: గత నాలుగైదు నెలలుగా టెస్టులలో అత్యంత చెత్త ప్రదర్శన, ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్తును దక్కించుకోవడంలో విఫలమవడం, డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు, సీనియర్ల పేలవ ఆటతీరు నేపథ్యంలో బీసీసీఐ జట్టులో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. భారత జట్టు ఆస్ట్రేలియా నుంచి తిరిగొచ్చాక.. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌తో పాటు కొంత మంది బోర్డు ముఖ్యులతో బీసీసీఐ సమీక్షా సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశంలో గంభీర్.. జట్టు ప్రక్షాళనలో భాగంగా పలు కీలక సూచనలు చేశాడు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ బీసీసీఐ గురువారం పది పాయింట్లతో కఠినమైన కొత్త పాలసీని తీసుకొచ్చింది. దీని ప్రకారం క్రికెటర్లందరూ ఈ నిబంధనలకు కట్టుబడి ఉండాలని బోర్డు స్పష్టంగా పేర్కొంది. ఇందుకు ఎవరూ అతీతులు కారని తెలిపింది.
దేశవాళీ టోర్నీల్లో ప్రతీ ఒక్కరూ ఆడాల్సిందేనన్న బోర్డు.. జాతీయ జట్టుకు ఎంపికయ్యేందుకు ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటామని కుండబద్దలు కొట్టింది. దేశవాళీల ద్వారా స్థానిక యువతకు స్టార్ క్రికెటర్లతో ఆడే అవకాశం లభిస్తుందని, తద్వారా వారి అనుభవం పనికొస్తుందని పేర్కొంది.