ముంబై: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతున్న కీలక తరుణంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. టీమ్ఇండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌తో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో కీలక సమావేశం ఏర్పాటుచేసింది. బుధవారం రాయ్‌పూర్‌లో జరగాల్సిన రెండో వన్డేకు ముందు ఈ ఇద్దరితోనూ సమావేశమవనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. ఏడాదికాలం వ్యవధిలో భారత టెస్టు జట్టుకు రెండు వైట్‌వాష్‌లు ఎదురవడం, డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలకు తోడు సీనియర్లు రోహిత్, కోహ్లీతో గంభీర్ కమ్యూనికేషన్ గ్యాప్‌పై వదంతులు వ్యాపిస్తున్న వేళ ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా, సంయుక్త కార్యదర్శి ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా ఈ మీటింగ్‌కు హాజరవనున్నారు. అయితే బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ ఈ మీటింగ్‌కు హజరవుతాడా? లేదా? అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.
నిరుడు టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీ.. ఈ ఏడాది టెస్టులకూ గుడ్‌బై చెప్పారు. ఈ దిగ్గజాల రిటైర్మెంట్ వెనుక పరోక్షంగా గంభీర్ హస్తమున్నదని గతంలో పుకార్లు షికార్లు చేశాయి. అదీగాక ఒక్క ఫార్మాట్లోనే ఆడుతున్న రోకోతో గంభీర్‌కు విభేదాల కారణంగా డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం దెబ్బతింటున్నదన్న విమర్శలూ లేకపోలేదు. ఇది జట్టు ప్రదర్శనపై పడే ప్రభావం ఉండటంతో బీసీసీఐ తక్షణ చర్యలకు ఉపక్రమించినట్టు సమాచారం.
అదీగాక రోకో భవిష్యత్‌పైనా ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో బుధవారం నాటి మీటింగ్‌లో దీనిపై చర్చించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. ఇక టెస్టుల్లో గంభీర్ అనుసరిస్తున్న వ్యూహాలు, జట్టు ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతున్న వేళ.. బీసీసీఐ అతడి నుంచి వివరణ కోరనుందని బోర్డు వర్గాల వినికిడి! టెస్టులకు కోచ్‌గా గంభీర్‌ను తప్పించాలన్న విమర్శలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ఏయే అంశాలు చర్చకు వస్తాయనేది ఆసక్తికరం.
ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘స్వదేశంలో టెస్టుల సందర్భంగా మైదానం లోపల, వెలుపల జట్టు వ్యూహాలు గందరగోళపరిచే విధంగా ఉన్నాయి. భారత జట్టు తదుపరి టెస్టు సిరీస్ 8 నెలల తర్వాత ఆడనుంది. ఈ నేపథ్యంలో మేం మరింత స్పష్టత, ముందస్తు ప్రణాళికను కోరుతున్నాం’ అని తెలిపాడు. అంతేగాక వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్, 2027లో వన్డే వరల్డ్ కప్ జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ టోర్నీల నాటికి జట్టు అంతర్గత సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని తాము భావిస్తున్నట్టు ఆయన చెప్పాడు.