హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ప్రీమియర్ లీగ్(టీపీఎల్) నిర్వహణకు బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు పేర్కొన్నారు. శనివారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంయుక్త కార్యదర్శి ఎన్నికలో గోవా క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన రోహన్ దేశాయ్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో హెచ్‌సీఏ ప్రతినిధిగా రోహన్ అభ్యర్థిత్వాన్ని జగన్ బలపర్చారు.
ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ప్రధాన కార్యదర్శి దేవజిత్ సైకియాతో హెచ్‌సీఏ ప్రతినిధులు దల్జీత్‌సింగ్, సునిల్ అగర్వాల్ భేటీ అయ్యారు. టీపీఎల్‌తో పాటు తెలంగాణలో ప్రఖ్యాతి గాంచిన మొయినుద్దౌలా గోల్డ్కప్ను తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ సహకారం కావాలని జగన్ కోరగా, అందుకు బోర్డుకు సమ్మతించింది. ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్‌లో టీపీఎల్ నిర్వహణకు బోర్డు ఓకే చెప్పిందని ఆయన స్పష్టం చేశారు.