ముంబై: భారత పేసర్ మహమ్మద్ షమీ(Mohammed Shami).. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ బాల్ పట్టాడు. గాయం నుంచి కోలుకున్న షమీ ఇటీవల బెంగాల్ తరపున రంజీ మ్యాచ్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతను మెరుగ్గానే బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కూడా ఆడుతున్నాడు. షమీ పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా.. బీసీసీఐ మాత్రం అతనికి కొన్ని కండీషన్స్ పెట్టింది. షమీ బౌలింగ్‌ను ఎప్పటికప్పుడు బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తున్నది. ఎక్కువ కాలం బ్రేక్ తీసుకోవడం వల్ల షమీ.. చాలా వెయిట్ పెరిగినట్లు తెలుస్తోంది. కాబట్టి అతను ముందుగా బరువు తగ్గాల్సి ఉంటుంది. దీంతో పాటు అతను తన ఫిట్నెస్ను ఇంప్రూవ్ చేయాల్సి ఉందన్న అభిప్రాయాలను బీసీసీఐ వ్యక్తం చేసింది.
ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. తొలి టెస్టును ఈజీగా నెగ్గింది టీమిండియా. అయితే రెండో టెస్టుకు షమీని రప్పిస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ బీసీసీఐ మెడికల్ బృందం మాత్రం ఆ తొందర ప్రదర్శించడం లేదు. రోహిత్ సేనతో షమీ కలవాలంటే మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌లు ఆడుతున్నా కొద్దీ.. షమీ తన బరువును కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు మెడికల్ టీం అంచనా వేస్తున్నది. బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్ డాక్టర్ నితిన్ పటేల్, నేషనల్ క్రికెట్ అకాడమీ శిక్షకుడు నిశాంత్ బోర్డోలాయ్ .. ప్రస్తుతం షమీ ట్రైనింగ్, రికవరీని పర్యవేక్షిస్తున్నారు.
ఇక ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్న నేపథ్యంలో.. షమీని అత్యవసరంగా ఆస్ట్రేలియాకు పంపాల్సిన అవసరం లేదన్న ఆలోచనలో బీసీసీఐ ఉన్నది. అయితే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బౌలర్ కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసే అవకాశం ఉంటుందని, దాని ఆధారంగా షమీ ఫిట్నెస్ను పూర్తిగా అంచనా వేయలేమని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ప్లాన్ ప్రకారం షమీ రికవరీ అయితే, అతను డిసెంబర్ 14వ తేదీన ఆస్ట్రేలియాతో ప్రారంభం అయ్యే మూడవ టెస్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.