దుబాయ్: ఆసియాకప్(Asia Cup)లో గత ఆదివారం సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడిన విషయం తెలిసిందే.ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు హరీస్ రౌఫ్, షాహిబ్జాద ఫర్హన్ ప్రవర్తించిన తీరును భారత్ ఖండించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ వద్ద అధికారికంగా ఫిర్యాదు నమోదు చేసింది. బుధవారం రోజున ఆ ఫిర్యాదు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐసీసీకి ఈమెయిల్ ద్వారా ఆ ఫిర్యాదు చేశారు. ఒకవేళ లిఖితపూర్వకంగా ఫర్హన్, రౌఫ్‌లు ఆ ఆరోపణలను ఖండిస్తే అప్పుడు ఐసీసీ దీనిపై దర్యాప్తు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ముందు ఆ ఇద్దరూ విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా ఐసీసీ ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు వ్యతిరేకంగా అధికారికంగా ఫిర్యాదు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పెహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి సంఘీభావంగా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదని కెప్టెన్ సూర్య పేర్కొన్న విషయం తెలిసిందే. సూర్య చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఉన్నట్లు పీసీబీ ఆరోపించింది.
సెప్టెంబర్ 21వ తేదీన జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ బౌండరీ లైన్ వద్ద రౌఫ్ కొన్ని సంకేతాలు చేశాడు. చేతి వేళ్లతో 6-0 చూపిస్తూ, విమానాలు కూలినట్లు సంజ్ఞ చేశాడు. గిల్, అభిషేక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వారితో వాగ్వాదానికి దిగాడు. ఇదే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన ఫర్హన్.. సెలబ్రేషన్లో భాగంగా తన బ్యాట్‌తో గన్ ఫైరింగ్ చేస్తున్నట్లు ఫోజు పెట్టాడు. ఐసీసీ ముందు ఆ ఇద్దరు ప్లేయర్లు వివరణ ఇవ్వకుంటే వాళ్లు ప్రవర్తనా నియమావళి కింద శిక్ష ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.
ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మెన్ మోషిన్ నఖ్వీ కూడా బుధవారం తన ఎక్స్ అకౌంట్లో ఓ వీడియోను పోస్టు చేశాడు. క్రిస్టియానా రోనాల్డోకు చెందిన స్లో మోషన్ వీడియోను పోస్టు చేశారు. విమానం అకస్మాత్తుగా కూలుతున్నట్లు ఆ వీడియోలో రోనాల్డ్ సంకేతం ఇస్తాడు. రౌఫ్ కూడా ఇలాంటి సంజ్ఞ చేశాడు.