BCCI : ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన రిషభ్ పంత్ (Rishabh Pant) కుంటుతూనే క్రీజులోకి రావడం.. పాదం నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేయడం చూశాం. ‘రీప్లేస్మెంట్ ప్లేయర్’ను తీసుకొని ఉంటే పంత్‌కు ఇబ్బంది తప్పేదిగా అని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పంత్ గాయపడిన తర్వాతి పరిణామాలతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మేల్కొంది. గాయంతో బాధపడుతున్న క్రికెటర్‌కు విశ్రాంతి ఇవ్వడమే ఉత్తమమని భావించింది.
మ్యాచ్ సమయంలో తీవ్రంగా గాయపడిన ఆటగాడి స్థానంలో మరొకరిని ఆడించేలా నిబంధనలు మార్చింది. దేశవాళీ సీజన్ 2025-26 నుంచే ఈ కొత్త రూల్ అమలులోకి వస్తుందని బీసీసీఐ తెలిపింది. ‘టెస్టులు వంటి మల్టీ డే మ్యాచ్ సమయంలో ఒక ఆటగాడు తీవ్రంగా గాయపడితే అతడి స్థానంలో మరొకరిని ఆడించాలి. ఆ రోజు ఆట పరిస్థితులను బట్టి రీప్లేస్‌మెంట్‌ను అనుమతించాలి. అయితే.. ప్లేయర్‌కు మ్యాచ్ సమయంలో లేదంటే మైదానంలో అయినా గాయపడాలి. అలాంటప్పుడే వాళ్లకు ప్రత్యామ్నాయంగా మరొకరిని ఆడించడానికి అంగీకరించాలి. త్వరలో ప్రారంభం కాబోయే దేశవాళీ క్రికెట్ సీజన్ నుంచే ఈ కొత్త రూల్‌ను పాటించాలి’ అని బీసీసీఐ వెల్లడించింది.
🚨 NEW RULE 🚨
BCCI introduces ‘Serious Injury Replacement’ rule for 2025-26 season in multi-day formats, allowing a like-for-like replacement – somewhat similar to concussion replacement – in case of a major injury to any player.#CricketTwitter pic.twitter.com/C9WGOEHyh9
— Cricbuzz (@cricbuzz) August 16, 2025
అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీ మాంచెస్టర్ టెస్టులో పంత్ గాయపడ్డాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడబోగా అతడి కుడి పాదం వేళ్లకు బంతికి బలంగా తాకింది. దాంతో.. పంత్ నొప్పిని తట్టుకోలేక రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. అప్పటికే పాదం వేలు ఎముక విరిగిందని వైద్యులు చెప్పినా జట్టును ఆదుకోవాలని క్రీజులోకి వచ్చి హాఫ్ సెంచరీ బాదాడు. ఇంగ్లండ్ పేసర్ వోక్స్ సైతం భుజం స్థానభ్రంశం చెందడంతో ఓవల్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేదు.
వోక్స్, పంత్
అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో పదో వికెట్‌గా చేతికి కట్టుతోనే క్రీజులోకి వచ్చాడు వోక్స్. నొప్పిని పంటిబిగవున భరిస్తూనే అతడు పరుగెత్తాడు. ఒకవేళ రీప్లేస్మెంట్ ప్లేయర్‌ను అనుమతించి ఉంటే పంత్, వోక్స్‌లు అంతగా ఇబ్బంది పడేవారు కాదని పలువురు అభిప్రాయపడ్డారు. భారత కోచ్ గౌతం గంభీర్ ఈ నిర్ణయానికి మద్దతు పలకగా.. ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ మాత్రం అబ్బే.. కరెక్ట్ కాదని అన్నాడు.