BCCI : అఫ్గనిస్థాన్ యువ క్రికెటర్ల మృతికి కారణమైన పాకిస్థాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పక్తిక రాష్ట్రంలో వైమానిక దాడులకు పాల్పడిన దాయాది దేశాన్ని కడిగిపారుస్తున్నారంతా. అఫ్గన్ క్రికెట్లో విషాదానికి కారణమైన పాక్ దాడిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఖండించాయి. కబీర్ అఘా, సిబ్ఘాతుల్లా, హరూన్ అనే ముగ్గురు యువ క్రికెటర్ల మృతి పట్ల విచారం వ్యకత్ చేస్తున్నామని బీసీసీఐ పేర్కొంది.
‘ముగ్గురు యువ క్రికెటర్లను కోల్పోయిన అఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డుకు, క్రికెటర్లను కోల్పోయిన కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తున్నాం. ఏమాత్రం ఆమోదయోగ్యం కాని దాడిని ఖండిస్తున్నాం. భవిష్యత్ తారలుగా ఎదగాలనుకున్న యువ ఆటగాళ్లు మృతి చెందడం ఎంతో బాధాకరం. ఇలాంటి ఘటనలు ఆందోళనకరం.ఈ కష్ట సమయంలో అఫ్గన్ ప్రజలకు సానుభూతి తెలియజేస్తున్నాం. మీ బాధను, ఆవేదనను మేమూ పంచుకుంటాం’ అని బీసీసీఐ తమ ప్రకటనతో తెలిపింది.
BCCI condoles the tragic loss of Afghan cricketers
Details 🔽
— BCCI (@BCCI) October 18, 2025
ఐసీసీ సైతం పాక్ దాడిని ఖండిస్తూ పోస్ట్ పెట్టింది. ‘ముగ్గురు క్రికెటర్లు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడి ఇంటికి వచ్చారు. అనూహ్యంగా పాక్ దాడిలో వారు మరణించారు. వీళ్లతో పాటు మరికొంతమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి హింసాత్మక దాడులను ఐసీసీ తీవ్రంగా ఖండిస్తోంది. క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించిన ఆ ముగ్గురు యువకులను బలిగొన్న పాక్ వాళ్ల కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది’ అని వెల్లడించింది.