Shreyas Iyer | స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌కు టీమిండియా వన్డే కెప్టెన్ బాధ్యతలను బీసీసీఐ అప్పగించనుందని వార్తలు వచ్చాయి. రోహిత్ శర్మ వారసుడిగా అయ్యర్ వన్డే సారథ్య బాధ్యతలు స్వీకరిస్తాడని జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ఈ ఊహాగానాలన్నింటికి బీసీసీఐ చెక్ పెట్టింది. వన్డే కెప్టెన్‌గా అయ్యర్‌ను నియమించే విషయంలో ఎలాంటి చర్చలు జరుగలేదని బోర్డు స్పష్టం చేసింది. 2027 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియాను సిద్ధం చేయాలని.. ఈ క్రమంలోనే కొత్త కెప్టెన్‌ను తీసుకువచ్చే ఆలోచనలో ఉందని.. కెప్టెన్ రేసులో శ్రేయాస్ అయ్యర్ ముందంజలో ఉన్నాడని పలు నివేదికలో పేర్కొన్నాయి. వాస్తవానికి ఆసియా కప్‌కు ఎంపిక చేసిన జట్టుల్లోనే అయ్యర్‌కు ఓటు దక్కలేదు కానీ.. వన్డే కెప్టెన్ బాధ్యతలు ఇవ్వనున్నట్లుగా తెగ ప్రచారం జరిగింది. ఈ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రస్తుతం బోర్డు వద్ద అలాంటి ప్రణాళిక ఏదీ లేదన్నారు. అయ్యర్ కెప్టెన్సీపై మీడియాలో వస్తున్న ఊహాగానాలు కేవలం పుకానేనని.. ఇందులో ఎలాంటి నిజం లేదన్నారు.
వాస్తవానికి ఆసియా కప్‌కు ఎంపిక చేసిన జట్టులో అయ్యర్‌కు చోటు కల్పించకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ సాగింది. బీసీసీఐ నిర్ణయంపై మాజీ ఆటగాళ్లతో పాటు క్రికెట్ నిపుణులు తప్పుపట్టారు. స్థిరంగా ఆడుతూ వస్తున్న ఆటగాడిని ఎందుకు కీలకమైన టోర్నీకి ఎంపిక చేయలేదని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో సైతం అభిమానులు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. కనీసం రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలోనే అయ్యర్ పేరును చేర్చకపోవడంపై ధ్వజమెత్తారు. అయితే, బెంచ్‌పై కూర్చోబెట్టాల్సి వస్తే.. అతని ఆత్మవిశ్వాసంపూ ప్రతికూల ప్రభావం చూపుతుందని బీసీసీఐ భావించిందని సమాచారం.
జట్టును ప్రకటించిన సమయంలో చీఫ్ సెలెక్టర్ అజీత్ అగార్కర్ అయ్యర్‌కు చోటు కల్పించకపోవడంపై మాట్లాడారు. ఈ విషయంలో అయ్యర్‌ది ఏం తప్పులేదని.. తమది కూడా ఎలాంటి తప్పులేదరన్నారు. జట్టులో కేవలం 15 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయగలమని.. ప్రస్తుతం అవకాశాల కోసం నిరీక్షించాల్సిందేనని స్పష్టం చేశాడు. వాస్తవానికి అయ్యర్ చాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. ఐదు మ్యాచుల్లో 243 పరుగులు చేశాడు. అలాగే, ఐపీఎల్‌లోనూ పరుగుల వరద పారించాడు. 17 మ్యాచ్‌ల్లో 604 పరుగులు చేశాడు. 50.33 సగటు, 175.07 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఇందులో ఆరు హాఫ్ సెంచరీలు ఉండగా.. టాప్ స్కోర్ 97 నాటౌట్. టీ20 ప్రపంచకప్ గెలిచినప్పటి నుంచి అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. గత 26 టీ20 మ్యాచ్‌లలో 949 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మరో ఏడు హాఫ్ సెంచరీలున్నాయి.