ఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్ ఆతిథ్యమివ్వనున్న ఆసియా కప్ నుంచి టీమ్ఇండియా వైదొలిగిందన్న వార్తలపై బీసీసీఐ స్పందించింది. పాకిస్థాన్‌కు చెందిన మోహ్సిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో భారత్ ఈ టోర్నీ నుంచి తప్పుకుందని వార్తలు రాగా.. బీసీసీఐ స్పందిస్తూ అవన్నీ పుకార్లేనని తేల్చి చెప్పింది. ఇదే విషయమై బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా స్పందిస్తూ.. ‘ఆసియా కప్‌తో పాటు, ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ టోర్నీల నుంచి భారత్ వైదొలిగిందని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం.
అసలు బీసీసీఐ దాని గురించి ఇప్పటి వరకూ చర్చించనేలేదు. ప్రస్తుతం మా దృష్టి అంతా ఐపీఎల్, రాబోయే ఇంగ్లండ్ సిరీస్‌ల మీదే ఉంది. ఆసియా కప్ గురించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే బీసీసీఐ గానీ, ఏసీసీ గానీ ఆ విషయాన్ని ప్రకటనలో వెల్లడిస్తుంది’ అని తెలిపాడు.