ముంబై : ఆధునిక భారత క్రికెట్ దిగ్గజాలుగా వెలుగొందుతున్న భారత వన్డే జట్టు సారథి రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రికెట్ కెరీర్ ముగిసినట్టేనా? ఇప్పటికే టీ20లు, టెస్టుల నుంచి తప్పుకున్న ఈ ద్వయం.. ప్రస్తుతానికి వన్డేలలో కొనసాగుతున్నది. రెండు ఫార్మాట్ల నుంచి వైదొలిగినా భారత వన్డే జట్టుకు రోహిత్ ఇప్పటికీ సారథిగా ఉన్నాడు. అయితే నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరుగబోయే వన్డే సిరీస్ తర్వాత ఈ ఇద్దరూ ఆటకు పూర్తిగా వీడ్కోలు పలుకనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వన్డే ప్రపంచకప్ (2027) వరకూ కొనసాగాలని వీరు భావిస్తున్నా బీసీసీఐ మాత్రం ఆ అవకాశం లేకుండా చేస్తున్నదని సమాచారం. వన్డే వరల్డ్ కప్ నాటికి ఫామ్‌ను కొనసాగిస్తూ, ఫిట్నెస్ను కాపాడుకోవడం ఈ ఇద్దరి ముందున్న ప్రధాన సవాల్ కాగా.. అంతకంటే ముందే ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్ తర్వాత దేశవాళీల్లోనూ ఆడాలని ఈ ఇద్దరికీ షరతు విధించినట్టు బోర్డు వర్గాల వినికిడి. డిసెంబర్లో విజయ్ హజారే ట్రోఫీ జరగాల్సి ఉంది. ఈ టోర్నీలో ఆడితేనే ‘రోకో’ భవిష్యత్తుకు గ్రీన్ సిగ్నల్ లభించనున్నట్టు సమాచారం. మరి ఈ దిగ్గజాలు దేశవాళీ ఆడతారా? లేదా? అన్నది ఆసక్తికరం!
రోకోపై వస్తున్న వార్తలపై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఒకవేళ వాళ్ల మనసులో ఏముందో బోర్డుకు (ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ముందు చెప్పినట్టు) చెప్పాలి. ప్రస్తుతానికి భారత జట్టు దృక్కోణంలో టీమ్ఇండియా దృష్టంతా వచ్చే ఏడాది జరుగబోయే టీ20 ప్రపంచకప్ మీదే ఉంది. ఇప్పటికిప్పుడైతే మేం ఆసియా కప్ మీద దృష్టి సారించాం’ అని తెలిపాడు. ఇప్పటికే ఈ ఇద్దరినీ టెస్టు జట్టులోంచి బీసీసీఐ బలవంతంగా పంపించందన్న అపవాదును మూటగట్టుకున్న బోర్డు.. వన్డే కెరీర్ల విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తుందా? ఒకవేళ అలా చేస్తే వారి అభిమానుల ఆగ్రహాన్ని బీసీసీఐ చవిచూడక తప్పదని బోర్డు భావిస్తున్నది. మరి రోకో విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొద్దిరోజులు వేచి చూడక తప్పదు.