Rohit Sharma | ముంబై: చాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ ఇంకా వన్డేలతో పాటు టెస్టులలోనూ కొనసాగుతాడా? ఒకవేళ జట్టులో కొనసాగినా నాయకత్వ పగ్గాలు ఇతరులకు అప్పజెప్పుతాడా? బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమ్ఇండియా ఘోర వైఫల్యం తర్వాత మొదలైన ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. న్యూజిలాండ్‌తో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫలితాన్ని బట్టి రోహిత్ భవితవ్యంపై బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్టు బోర్డు వర్గాల సమాచారం.
వయసు, ఫిట్నెస్, ఫామ్, ఇతరత్రా కారణాలతో రోహిత్‌ను వన్డేల నుంచి తప్పించి 2027 వన్డే ప్రపంచకప్ నాటికి మరో నాయకుడిని సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఉన్న బీసీసీఐ.. ఇదే విషయాన్ని రోహిత్‌తో చర్చించినట్టు వినికిడి. ఇదే విషయమై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్.. రోహిత్‌తో ఇది వరకే చర్చించినట్టు తెలుస్తోంది.
అయితే రోహిత్ మాత్రం మరికొంతకాలం కొనసాగేందుకు మొగ్గుచూపుతున్నాడని, రిటైర్మెంట్ నిర్ణయాన్ని బీసీసీఐ అతడికే వదిలేసినట్టు బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు. రోహిత్‌తో పాటు కోహ్లీతోనూ బోర్డు చర్చించిందని, అయితే అతడి విషయంలో తొందరపాటు ఏం లేదని ఆయన చెప్పారు. అంతేగాక ఫైనల్ తర్వాత ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులలోనూ మార్పులు చేసే అవకాశముంది. శ్రేయాస్‌కు తిరిగి బోర్డు కాంట్రాక్టు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.