BCCI : ఈమధ్యే ఫస్ట్ క్లాస్ క్రికెట్(Domestic Cricket) షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకుంది. నీతూ డేవిడ్(Neetu David) ఆధ్వర్యంలోని బృందం భారత మహిళల క్రికెట్ జట్టుకు కొత్త సెలెక్టర్లను ఎంపిక చేసింది. మాజీ క్రికెటర్ శ్యామా దే షా(Shyama Dey Shaw)ను సీనియర్ జట్టుకు సెలెక్టర్‌గా నియమించింది. జూనియర్ జట్టు సెలెక్షన్ కమిటీకి చీఫ్‌గా వీఎస్ తిలక్ నాయుడు(VS Thilak Naidu) ఎన్నికయ్యాడు.
మహిళల క్రికెట్ జట్టు సెలెక్టర్ల కోసం బీసీసీఐ అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజపే నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ(CAC) వచ్చిన దరఖాస్తులను పరిశీలించింది. చివరకు శ్యామా దే షా, తిలక్ నాయుడు పేర్లను బీసీసీఐకి సిఫారసు చేసింది.
నీతూ డేవిడ్
సీనియర్ జట్టు సెలెక్టర్లు – నీతూ డేవిడ్ (చైర్ పర్సన్), శ్యామా దే షా, రేణు మార్గరేట్, హారతీ వైద్యా, కల్పనా వెంకటచ.
జూనియర్ జట్టు సెలెక్టర్లు – వీఎస్ తిలక్ నాయుడు(అధ్యక్షుడు), రణదేవ్ బోస్, హర్విందర్ సింగ్ సోధీ, ప్రతీక్ పటేల్, కృష్ణన్ మోహన్.
ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన శ్యామ షా మీడియం పేస్ బౌలర్ కూడా. దేశవాళీలో శ్యామ మొదట బెంగాల్ జట్టుకు, ఆ తర్వాత రైల్వేస్(1998 – 2002)కు ప్రాతినిధ్యం వహించింది. భారత జట్టు తరఫున మూడు టెస్టులు, ఐదు వన్డేలు మాత్రమే ఆడింది. ఆటకు వీడ్కోలు ప్రకటించాక బెంగాల్ జట్టు సెలెక్టర్‌గా రెండు సార్లు సేవలందించింది. మాజీ క్రికెటర్ అయిన తిలక్ నాయుడు వికెట్ కీపర్, బ్యాటర్. అతను 1998 – 99, 2009 – 10 మధ్య కర్నాటకకు ఆడాడు. దులీప్, దేవ్‌ధర్ ట్రోఫీల్లో సౌత్ జోన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. విధ్వంసక ఆటగాడైన నాయుడు 93 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 4,386 రన్స్ కొట్టాడు. ఆ తర్వాత మూడేళ్ల పాటు కర్నాటక జూనియర్ సెలెక్షన్ కమిటీ(KSCA)కి హెడ్‌గా పనిచేశాడు.