న్యూఢిల్లీ : దేశంలో మహిళా క్రికెట్‌కు మహర్దశ రాబోతున్నది. స్వదేశం వేదికగా ఇటీవల ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీలో భారత్ టైటిల్ విజేతగా నిలిచిన నేపథ్యంలో మహిళా క్రికెట్‌కు పెద్దపీట వేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. మహిళల దేశవాళీ టోర్నీలకు మరింత ప్రాధాన్యం కల్పిస్తూ బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా ఆమోదం పొందిన వాటిలో ఇప్పటి నుంచి దేశవాళీ టోర్నీల్లో ఆడే సీనియర్ మహిళా క్రికెటర్లు రోజుకు రూ.50వేలు పొందనున్నారు. గతంలో ఉన్న(రూ.20వేలు) దానికంటే ఇది రెండింతలు ఎక్కువ కావడం విశేషం. తుది జట్టులో ఉండే ప్లేయర్లకు 50వేలు దక్కనుండగా, రిజర్వ్ ప్లేయర్లకు అందులో సగం రూ.25వేలు లభించనున్నాయి.
ఇక జాతీయ టీ20 టోర్నీలో ఫైనల్ లెవన్ ప్లేయర్లకు మ్యాచ్ ఫీజు కింద రూ.25వేలు, రిజర్వ్ ప్లేయర్లకు 12, 500లు పొందనున్నారు. దీని ద్వారా దేశవాళీ టోర్నీ సీజన్ మొత్తంగా అన్ని ఫార్మాట్లు ఆడితే ఒక్కో ప్లేయర్ రూ.12 లక్షల నుంచి 14 లక్షల వరకు ఆదాయం లభించే అవకాశముంది. మరోవైపు అండర్-19, అండర్-23 టోర్నీల్లో ఆడే మహిళా ప్లేయర్లు రోజుకు రూ.25వేలు, రిజర్వ్ ప్లేయర్లకు రూ.12,500వేలు లభించనున్నాయి. కొత్త స్కీమ్‌లో మ్యాచ్ అంపైర్లు, రిఫరీలు ఒక్క రోజుకు రూ.40వేలు పొందనున్నారు. అయితే టోర్నీలో కీలక మ్యాచ్‌లకు ఇది రూ.50వేల నుంచి రూ.60వేల వరకు ఉండనుంది. దీని ద్వారా రంజీ ట్రోఫీలో ఒక మ్యాచ్‌కు దాదాపు రూ.1.60లక్షలు దక్కే అవకాశముండగా, నాకౌట్‌లకు ఇది రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు ఉంటుంది.