BCCI : పొట్టి ప్రపంచకప్ ముగియకముందే భారత జట్టు (Team India) మరో పొట్టి సిరీస్‌కు సన్నద్దం కానుంది. మెగా టోర్నీ ముగిసిన వారంలోపే జింబాబ్వే (Zimbabwe) లో టీమిండియా పర్యటించనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌ను ఖరారు చేసిన భారత క్రికెట్ బోర్డు సోమవారం మ్యాచ్ తేదీలను వెల్లడించింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubamn Gill) కెప్టెన్‌గా 15 మందితో కూడిన స్క్వాడ్‌ను అజిత్ అగార్(Ajit Agarkar) నేతృత్వంలోని సెలెక్టర్లు వెల్లడించారు.
వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, రాంచీ టెస్టు హీరో ధ్రువ్ జురెల్(Dhruv Jurel)లు చోటు దక్కించుకున్నారు. ఐపీఎల్ 17వ సీజన్లో అద్భుతంగా రాణించిన కుర్రాళ్లు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండేలు తొలిసారి బ్లూ జెర్సీ వేసుకోనున్నారు. సీనియర్ పేసర్ ఖలీల్ అహ్మద్ సైతం బృందంలో ఉన్నాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జూలై 6వ తేదీన జరిగే తొలి మ్యాచ్‌తో టీ20 సిరీస్ ఆరంభం కానుంది.
భారత స్క్వాడ్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే.
భారత్, జింబాబ్వే జట్లు జూలై 6వ తేదిన తొలి మ్యాచ్ ఆడనున్నాయి. మొత్తం ఐదు మ్యాచ్‌లకు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక కానుంది. జూలై 7 వ తేదీన రెండో టీ20, జూలై 10న మూడో టీ20, జూలై 13న నాలుగో టీ20, జూలై 14న ఐదో టీ20 జరుగనుంది. మధ్యాహ్నం 1 గంటకు మ్యాచ్‌లు షురూ అవుతాయి.
జింబాబ్వే పర్యటనకు పలువురు సీనియర్లను బీసీసీఐ పక్కన పెట్టనుంది. టీ20 వరల్డ్ కప్ ఆడుతున్నకెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలతో పాటు సూర్యకుమార్ యాదవ్‌కు భారత బోర్డు విశ్రాంతి ఇవ్వనుంది. దాంతో, యువకులతో నిండిన జట్టును జింబాబ్వేకు పంపాలని సెలెక్టర్లు భావిస్తున్నారు.
ఇప్పటివరకూ ప్రధాన కోచ్ ఎవరో తేలలేదు. టీ20 వరల్డ్ కప్ ముగిసేలోపు గౌతం గంభీర్‌ను హెడ్‌కోచ్‌గా ప్రకటిస్తారో? లేదో తెలియదు. దాంతో, నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్‌గా కొనసాగుతున్న వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) జింబాబ్వే సిరీస్‌కు కోచ్‌గా వ్యవహరించే చాన్స్ ఉంది.