ముంబై : ఇటీవలే దుబాయ్ వేదికగా ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. 12 ఏండ్ల విరామం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమ్ఇండియాకు రూ.58 కోట్ల క్యాష్ప్రైజ్ ప్రకటించింది. ఇది ఐసీసీ ప్రైజ్మనీ (రూ. 19.50 కోట్లు) కంటే మూడు రెట్లు అధికం కావడం విశేషం. బీసీసీఐ ప్రకటించిన నగదు బహుమానంలో జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 3 కోట్లు అందనుంది. హెడ్కోచ్ గౌతం గంభీర్కూ ఆటగాళ్లతో సమానంగా రూ. 3 కోట్లు దక్కనుంది. అతడి కోచింగ్ బృందం (రియాన్ డస్కటె, అభిషేక్ నాయర్, సితాన్షు కొటక్, మోర్నీ మోర్కెల్, దిలీప్)తో పాటు ఇతర సహాయక సిబ్బందికి తలా రూ. 50 లక్షలు అందనున్నాయి. జట్టుతో ప్రయాణించిన బీసీసీఐ ప్రతినిధులకు తలా రూ. 25 లక్షలు దక్కుతాయి.