India A | ఢిల్లీ: త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న భారత ‘ఏ’ జట్టును బీసీసీఐ ప్రకటించింది. దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలో 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. గతేడాది బీసీసీఐ క్రమశిక్షణ చర్యలతో సెంట్రల్ కాంట్రాక్టుతో పాటు జట్టులో చోటు కోల్పోయిన ఇషాన్ కిషన్.. ఆశ్చర్యకరంగా ‘ఏ’ జట్టుకు ఎంపికయ్యాడు. దేశవాళీలో సంచలన ప్రదర్శనలు చేసిన కరుణ్ నాయర్ సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చాడు. 33 ఏండ్ల నాయర్.. ‘ఏ’ జట్టులో రాణిస్తే ప్రధాన జట్టులోనూ ఆడే అవకాశాలు మెరుగవుతాయి.
ఇక టీమ్ఇండియా రెగ్యులర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, రుతురాజ్, నితీశ్ కుమార్ రెడ్డి వంటి స్టార్ క్రికెటర్లూ జట్టులో ఉన్నారు. కాగా ఇటీవల కాలంలో వన్డేలు, టీ20లలో నిలకడగా రాణిస్తున్న శ్రేయాస్ అయ్యర్ సైతం ‘ఏ’ జట్టులో ఉంటాడని ఆశించినా అతడికి నిరాశే ఎదురైంది. ఈశ్వరన్ సారథ్యంలోని భారత జట్టు.. ఇంగ్లండ్ లయన్స్‌తో మే 30న తొలి టెస్టు, జూన్ 6న రెండో టెస్టు ఆడనుంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత భారత టెస్టు జట్టు పగ్గాలు అందుకుంటాడని భావిస్తున్న శుభ్‌మన్ గిల్‌తో పాటు యువ బ్యాటర్ సాయి సుదర్శన్ రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నారు.