న్యూఢిల్లీ : దేశవాళీ క్రికెట్ 2026-27 సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఆగస్టు 23న ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీతో ఈ మెగా సీజన్‌కు తెరలేవనుంది. ఏజ్ గ్రూప్, సీనియర్ విభాగాల్లో కలిపి ఈ సీజన్లో రికార్డు స్థాయిలో ఏకంగా 1,788 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆధునిక క్రికెట్ అవసరాలకు అనుగుణంగా అండర్-23 వైట్ బాల్ టోర్నమెంట్‌తో పాటు ఇంటర్ యూనివర్సిటీ విజ్జీ ట్రోఫీని ఇకపై టీ20 ఫార్మాట్ లో నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ క్యాలెండర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీని క్రికెటర్ల వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ను దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా రెండు విడతల్లో నిర్వహించనున్నారు. తొలి విడత లీగ్ మ్యాచ్‌లు అక్టోబర్ 11 నుంచి నవంబర్ 5 వరకు (నాలుగు రౌండ్లు) జరుగుతాయి.
ఆ తర్వాత పరిమిత ఓవర్ల టోర్నీలైన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 (నవంబర్ 14- డిసెంబర్ 6), విజయ్ హజారే వన్డే ట్రోఫీ (డిసెంబర్ 14-జనవరి 8) ముగిశాక.. జనవరి 17 నుంచి మార్చి 3 వరకు రంజీ ట్రోఫీ రెండో విడత (నాకౌట్ సహా) జరగనుంది. డిసెంబర్లో జరిగే ఐపీఎల్ వేలానికి ముందే ముస్తాక్ అలీ టోర్నీ ముగిసేలా షెడ్యూల్ చేయడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల స్కౌట్లకు యువ ప్రతిభను గుర్తించే మంచి అవకాశం లభించనుంది. ఇక పాఠశాల విద్యార్థులైన క్రీడాకారులు తమ వార్షిక, బోర్డు పరీక్షలకు సిద్ధమవడానికి వీలుగా ఫిబ్రవరి-మార్చిలో జరిగే విజయ్ మర్చంట్ ట్రోఫీ (అండర్-16) నవంబర్- జనవరి మధ్యలోనే పూర్తయ్యేలా బీసీసీఐ షెడ్యూల్ చేసింది.