దుబాయ్: స్వదేశంలో వచ్చే నెల 2 నుంచి వెస్టిండీస్‌తో మొదలుకాబోయే రెండు టెస్టులకు గాను తాజాగా ప్రకటించిన భారత జట్టులో కమ్‌బ్యాక్ బ్యాటర్ కరణ్ నాయర్‌పై వేటు పడింది. సుమారు తొమ్మిదేండ్ల విరామం తర్వాత ఆగస్టులో ఇంగ్లండ్ వేదికగా ముగిసిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆడిన అతడు అంచనాలు అందుకోవడంలో విఫలమవడంతో సెలక్టర్లు నాయర్‌ను పక్కనబెట్టారు. అతడితో పాటు ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌పైనా వేటు వేసిన సెలక్టర్లు.. యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, కర్నాటక బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్‌కు జట్టులో చోటు కల్పించారు.
ఆసియా కప్ ఆడేందుకు వెళ్లిన భారత టెస్టు సారథి శుభ్‌మన్ గిల్‌తో పాటు హెడ్‌కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గురువారం దుబాయ్‌లో నిర్వహించిన సమావేశంలో 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. గిల్ సారథ్యంలోని ఈ జట్టుకు ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కాలిగాయంతో బాధపడుతున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు విశ్రాంతినిచ్చారు. దీంతో గిల్‌కు డిప్యూటీగా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వ్యవహరించనున్నాడు. సొంతగడ్డపై గిల్‌కు ఇదే తొలి సిరీస్ కాగా డబ్ల్యూటీసీ నాలుగో సీజన్లో సొంతగడ్డపై టీమ్‌ఇండియాకూ ఇది మొదటి సిరీస్. పేసుగుర్రం బుమ్రా రెండు టెస్టులకూ అందుబాటులో ఉండనున్నాడు.
నాయర్, శార్దూల్‌ను మినహాయిస్తే ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లిన జట్టులో ఉన్న టీమ్‌నే సెలక్టర్లు విండీస్‌తో టెస్టులకు ఎంపికచేశారు. పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్‌కు స్థానం దక్కగా అతడికి బ్యాకప్ కీపర్‌గా దేశవాళీల్లో రాణిస్తున్న జగదీశన్కూ అవకాశం దక్కింది. సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు ఇటీవల భారత విదేశీ పర్యటనలకు బ్యాకప్ ఓపెనర్‌గా వెళ్తున్న అభిమన్యు ఈశ్వరన్‌కూ జట్టులో చోటు దక్కలేదు. ఇక సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపారు.
అతడి ఫిట్‌నెస్‌పై తమకేమీ సమాచారం లేదని చీఫ్ సెలక్టర్ అగార్కర్ చెప్పడం గమనార్హం. నాయర్‌పై వేటును ప్రస్తావిస్తూ& ‘నాయర్ నుంచి మేం చాలా ఆశించాం. కానీ అతడు మా అంచనాలను అందుకోలేకపోయాడు. పడిక్కల్ ఆస్ట్రేలియాలో బాగా ఆడాడు. రాబోయే సిరీస్‌లోనూ అదే ఫామ్ కొనసాగిస్తాడని ఆశిస్తున్నాం. నితీశ్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నాం’ అని తెలిపాడు. నలుగురు స్పిన్నర్లుగా జడేజా, అక్షర్, కుల్దీప్, వాషింగ్టన్ చోటు దక్కించుకోగా పేస్ బాధ్యతలను బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ మోయనున్నారు. ఇరుజట్ల మధ్య అక్టోబర్ 2-6 మధ్య అహ్మదాబాద్‌లో తొలి టెస్టు, 10-14 మధ్య ఢిల్లీలో రెండు టెస్టు జరుగుతుంది.
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్‌కుమార్ రెడ్డి, జగదీశన్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్