IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్ చివరి దశకు చేరింది. దాంతో, ప్లే ఆఫ్స్(IPL Play Offs)కి చేరిన నాలుగు జట్లు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ సమయంలో మైదానంలో ఆటగాళ్ల మెరుపులు ఏమోగానీ వరుణుడి (Rain)దే పైచేయి అవుతోంది. గత మూడు మ్యాచులకు వర్షం అంతరాయం కలిగించగా.. రెండిటినీ రద్దు చేశారు. దాంతో, నాకౌట్ మ్యాచ్లకు క్వాలిఫై అయిన జట్ల ఆటగాళ్లు కలవరపడుతున్నారు. మరోవైపు ఫ్యాన్స్ సైతం రిజర్వ్ డే ఉంటుందా? లేదా? అని చర్చించుకుంటున్నారు. వాన అడ్డుపడే అవకాశ ఉన్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
పదిహేడో సీజన్లో ప్లే ఆఫ్స్ బెర్తులతో పాటు క్వాలిఫయర్, ఎలిమినేటర్ పోరులో తలపడేది ఎవరో తేలిపోయింది. మే 21న క్వాలిఫయర్, మే 22న ఎలమినేటర్ మ్యాచ్లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్లకు వర్షం అంతరాయం కలిగించే చాన్స్ ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన ఆ జట్ల టైటిల్ కల కల్లలైనట్టే. అందుకని ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు బీసీసీఐ రిజర్వ్ డేను కేటాయించింది.
𝗧𝗵𝗲 𝗙𝗶𝗻𝗮𝗹 𝗖𝗮𝗹𝗹 ✈️
Mark your calendars folks, it all comes down to this! 🗓️ 🙌
Who are you backing to lift the 🏆?#TATAIPL | #TheFinalCall pic.twitter.com/84bsMe5FWK
— IndianPremierLeague (@IPL) May 20, 2024
మే 21 నుంచి మే 26 వరకు అహ్మదాబాద్, చెన్నైలో జరిగే ఈ మ్యాచ్లు రద్దయ్యే చాన్స్ లేదు. వర్షం అంతరాయం కలిగిస్తే మరుసటి రోజు యథావిధంగా మ్యాచ్లను నిర్వహించేందుకు బీసీసీఐ, ఐపీఎల్ మేనేజ్మెంట్ సిద్ధంగా ఉంది. మే 21న జరిగే క్వాలిఫయర్ 1లో కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి.
ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు దూసుకెళ్తుంది. అనంతరం మే 22న జరిగే ఎలిమినేటర్లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఢీకొంటాయి. క్వాలిఫయర్లో ఓడిన టీమ్ ఈ మ్యాచ్ విజేతతో అమీతుమీ తేల్చుకోనుంది. మే 26న చెన్నైలో టైటిల్ పోరు జరుగనుంది. ఈసారి అయినా కొత్త చాంపియన్ చూస్తామా?, మాజీ చాంపియన్లనే ట్రోఫీ వరించనుందా? అనేది మరో ఆరు రోజుల్లో తేలిపోనుంది.