Shakib Al Hasan : హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్(Shakib Al Hasan)కు భారీ ఊరట. కోర్టు ఆదేశాల ప్రకారం అతడిని స్వదేశానికి పంపేది లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB) స్పష్టం చేసింది. అంతేకాదు మర్డర్ కేసులో దోషిగా తేలేంత వరకూ అతడు జట్టుతో కొనసాగేందుకు మంగళవారం బీసీబీ ఓకే చెప్పింది. దాంతో, పాకిస్థాన్‌తో రెండో టెస్టులో ఆడేందుకు షకీబ్‌కు మార్గం సుగమం అయింది.
‘బంగ్లాదేశ్ తరఫున షకీబ్ ఆడుతూనే ఉంటాడు. అతడిని స్వదేశానికి రప్పించాలని కోర్టు నుంచి మాకు లీగల్ నోటీసు వచ్చింది. అయితే.. షకీబ్ క్రికెట్ ఆడుతాడని మేము కోర్టుకు బదులిచ్చాం. ప్రస్తుతం అతడిపై హత్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అది ఒక విచారణలో తొలి దశ మాత్రమే. కేసు ముగిసేందుకు చాలా సమయం ఉంది.
అతడు కాంట్రాక్ట్ ప్లేయర్. అందుకని అతడికి అవసరమైన న్యాయ సహాయాన్ని మేము అందిస్తాం. మరో విషయం ఏంటంటే..? పాక్ పర్యటన తర్వాత షకీబ్ భారత్‌తో టెస్టు సిరీస్‌లోనూ ఆడుతాడు’ అని బీసీబీ అధ్యక్షుడు ఫరూఖీ అహ్మద్ ఓ ప్రకటనలో వెల్లడించాడు. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ల మధ్య ఆగస్టు 30వ తేదీన రెండో టెస్టు జరుగనుంది.
షకీబ్‌పై ఆగస్టు 25న హత్య కేసు నమోదైంది. వస్త్ర పరిశ్రమలో పనిచేసే తన కుమారుడు రూబెల్‌ను ఆగస్టు 5న హత్యకు గురయ్యాడని, ఆ మర్డర్‌లో షకీబుల్ హసన్ పాత్ర ఉందని అతడి తండ్రి రఫికుల్ ఇస్లాం కేసు వేశాడు. దాంతో, సుప్రీం కోర్టు న్యాయవాది షాజిబ్ మహమూద్ అలామ్ బీసీబీకి లీగల్ నోటీసు పంపాడు.
పాకిస్థాన్ గడ్డపై జరిగిన రావల్పిండి టెస్టు(Rawalpindi Test)లో షకీబ్ అద్భుతంగా రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి పాకిస్థాన్(Pakistan)పై బంగ్లాదేశ్ చిరస్మరణీయ విజయంలో భాగయ్యాడు. అంతేకాదు వ్యక్తిగతంగా మరో మైలురాయికి చేరువయ్యాడు. న్యూజిలాండ్ దిగ్గజం డానియెల్ వెటోరీ (Daniel Vettori) రికార్డును ఈ ఆల్‌రౌండర్ బద్ధలు కొట్టేశాడు.
Shakib Al Hasan went past Daniel Vettori to become the leading wicket-taker among left-arm spinners 🌀
Full list: https://t.co/f8kW7n3Q2J | #PAKvBAN pic.twitter.com/gpZoom1nt0
— ESPNcricinfo (@ESPNcricinfo) August 25, 2024
అంతర్జాతీయ క్రికెట్లో 707 వికెట్లతో వెటీరీని షకీబ్ అధిగమించాడు. కివీస్ వెటరన్ ఖాతాలో 705 వికెట్లు ఉన్నాయి. షకీబ్ ఇప్పటివరకూ టెస్టుల్లో 241, వన్డేల్లో 317, టీ20ల్లో 149 వికెట్లు పడగొట్టాడు. రావల్పిండి టెస్టులో బంగ్లాదేశ్ జట్టు చరిత్ర సృష్టించింది. డ్రా ఖావడం పక్కా అనుకున్న మ్యాచ్‌లో అనూహ్య విజయంతో నజ్ముల్ హుసేన్ శాంటో సేన పాకిస్థాన్(Pakistan)కు షాకిచ్చింది. దాంతో, పాక్‌పై టెస్టుల్లో తొలి విజయం నమోదు చేసింది.