ప్రభుత్వం రాచకొండ కమిషనరేట్ ఉనికి లేకుండా కొత్త మల్కాజిగిరి కమిషనరేట్‌గా నామకరణం చేస్తూ నిర్ణయం తీసుకుంది. మల్కాజిగిరి కమిషనరేట్ ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగా కమిషనర్‌ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి హడావిడిగా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్యూచర్ సిటీని, యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్కాజిగిరి కమిషనర్‌గా అవినాశ్ మహంతిని నియమించింది. సైబరాబాద్ కమిషనర్‌గా రమేశ్‌రెడ్డిని నియమించింది. అలాగే ప్యూచర్ సిటీ కమిషనర్‌గా ప్రస్తుతం రాచకొండ కమిషనర్‌గా పనిచేస్తున్న సుధీర్‌బాబును నియమించింది.
సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్‌ను నియమించింది. జీహెచ్ఎంసీని పునర్విభజన చేసినట్లే ట్రై పోలీస్ కమిషనరేట్లను కూడా పునర్విభజన చేస్తుందంటూ రెండు రోజుల క్రితం అధికారులు చర్చించినట్లు ఆదివారం విషయం వెలుగులోకి వచ్చింది. అభిప్రాయాల స్థాయిలోనే ఉందని, పూర్తిగా ఇంకా నిర్ణయం జరగలేదంటూ కొందరు అధికారులు పేర్కొన్నారు. ఇంతలోనే సోమవారం కమిషనరేట్లను పునర్విభజిస్తూ అధికారులకు కూడా పోస్టింగ్‌లు ఇచ్చేశారు. జీహెచ్ఎంసీ పునర్విభజనతో 12 జోన్ల ట్రై పోలీస్ కమిషనరేట్లను సైతం పునర్విభజించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇందులో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉనికి లేకుండా కుట్ర చేసింది. ఈ క్రమంలోనే రాచకొండ పేరును తొలగించిందిని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది. సోమవారం ఉదయం నుంచి ఈ విషయంపై లీక్‌లు ఇచ్చారు. సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలోని విశాలమైన పోలీస్ కమిషనరేట్‌గా రాచకొండ కమిషనరేట్‌కు పేరుంది. పదేండ్లుగా ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు లేకుండా పోలీసింగ్ అక్కడ కొనసాగుతుంది.
పవిత్రమైన యాదాద్రి ఆలయానికి పటిష్ట బందోబస్తు ఉండాలనే ఉద్దేశంతో రాచకొండ కమిషనరేట్‌లో భాగం చేశారు. ప్రాచీన చరిత్ర కల్గిన రాచకొండ పేరును ఎప్పటికీ గుర్తుండేలా 2016లో సైబరాబాద్‌ను విడగొట్టి కొత్తగా రాచకొండ కమిషనరేట్‌ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రపంచస్థాయి కార్యక్రమాలు జరిగాయి. ఎక్కడ కూడా ఎలాంటి లోపం లేకుండా పోలీసింగ్ జరిగింది. ఇటీవల ప్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్‌కు సైతం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు. అలాంటి కమిషనరేట్ ఉనికి లేకుండా నేడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని పోలీసు వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

Hyd3
మల్కాజిగిరి కమిషనరేట్‌గా ..
ప్రస్తుతం ట్రై పోలీస్ కమిషనరేట్లను పునర్విభజన చేసి జీహెచ్ఎంసీలో ఉన్నట్లుగానే 12 జోన్లను చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం సైబరాబాద్‌లో ఉన్న రాజేంద్రనగర్, శంషాబాద్‌ను హైదరాబాద్‌లోకి కలిపి, సంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాలను సైబరాబాద్‌లోకి కలుపనున్నారు. అలాగే రాచకొండ కమిషనరేట్‌లో ఇప్పటి వరకు ఉన్న యాదాద్రి భువనగిరి, మహేశ్వరం జోన్లను తొలగించారు. ప్రస్తుతం మల్కాజిగిరి జోన్లో గతంలో ఉన్న మల్కాజిగిరి, ఎల్బీనగర్ జోన్లలోని ప్రాంతాలు మాత్రమే ఉండనున్నాయి. అయితే ఇక్కడ ఉప్పల్ జోన్‌ను ఏర్పాటు చేసి, మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలను కలుపనున్నారు.
ప్యూచర్ సిటీ కమిషనరేట్లోకి..
కొత్తగా ప్యూచర్ సిటీ పేరుతో ఏర్పాటు చేసిన కమిషనరేట్‌కు మహేశ్వరం జోన్‌తో పాటు ప్రస్తుతం సైబరాబాద్‌లో ఉన్న చేవెళ్ల, షాద్‌నగర్, శంకర్పల్లి ప్రాంతాలను కలుస్తున్నాయి. దీంతో పాటు పోలీసింగ్ సేవలు వేగంగా ప్రజలకు అందించే ఉద్దేశంతో హైదరాబాద్‌లో గతంలో ఉన్న ఐదు జోన్లను ఏడుగా పెంచారు. అలాంటిది హైదరాబాద్‌లో ఉన్న జోన్ల పేర్లు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అటూ జీహెచ్ఎంసీని, ఇటూ పోలీసింగ్‌ను ప్రణాళికలు లేకుండా ఇష్టానుసారంగా విభజించి ప్రభుత్వ యంత్రాంగం సేవలను ప్రజలకు మరింత దూరం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.