NTR | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిగత హక్కులను కాపాడాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు అనుకూల తీర్పు ఇవ్వడం తెలిసిందే. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఈ–కామర్స్ వెబ్సైట్లలో తన పేరు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం వల్ల తన వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతోందని ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, నటుడి వ్యక్తిగత హక్కులను రక్షించేలా కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ తారక్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. డిజిటల్ యుగంలో వ్యక్తిగత హక్కుల ప్రాధాన్యతను గుర్తించి రక్షణాత్మక ఉత్తర్వులు జారీ చేసినందుకు కోర్టుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. “నేటి డిజిటల్ యుగంలో నా వ్యక్తిగత హక్కులను కాపాడే రక్షణాత్మక ఉత్తర్వును మంజూరు చేసినందుకు ఢిల్లీ హైకోర్టుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సుప్రీంకోర్టు న్యాయవాదులు డాక్టర్ బాలజానకి శ్రీనివాసన్, డాక్టర్ అల్కా డాకర్లకు, అలాగే రాజేందర్, రైట్స్ & మార్క్స్ బృందం అందించిన లీగల్ సపోర్ట్‌కు నా కృతజ్ఞతలు. మీ స్థిరమైన మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు” అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఈ పోస్టుకు #Justice #PersonalityRights #DigitalAge అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను కూడా జోడించారు.
ఈ తీర్పు సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణలో కీలక మైలురాయిగా మారిందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అనుమతి లేకుండా సెలబ్రిటీల పేర్లు, చిత్రాలు, వీడియోలు వినియోగించే అంశాలపై ఈ తీర్పు ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్ చివరిగా వార్ 2 చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.