ఢిల్లీ: భారత్, వెస్టిండీస్ మధ్య శుక్రవారం నుంచి ఢిల్లీ వేదికగా ఆరంభం కానున్న రెండో టెస్టులో పరుగుల వరద పారనుంది. అరుణ్ జైట్లీ (ఫిరోజ్ షా కోట్ల)లో బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్‌ను సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. తొలి రెండు రోజులు పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉండి మూడో రోజు నుంచి బంతి స్పిన్‌కు అనుకూలించే విధంగా పిచ్‌ను రూపొందించినట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
సంప్రదాయకంగా కోట్లా పిచ్‌లో తొలి రోజు నుంచే బంతి మెలికలు తిరుగుతూ స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉంటుంది. కానీ విండీస్‌తో రెండో టెస్టుకు మాత్రం తొలి రెండున్నర రోజుల పాటు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండి తర్వాత స్పిన్నర్లకు లాభించే విధంగా తయారుచేసినట్టు సమాచారం. ఒకవేళ విండీస్ గనుక ముందు బ్యాటింగ్ చేస్తే అహ్మదాబాద్ మాదిరిగానే మ్యాచ్ మూడు రోజుల్లో ముగియకుండా ఉండేందుకే ఇలాంటి పిచ్‌ను రూపొందించినట్టు తెలుస్తున్నది.