చెన్నై: కొద్దిరోజుల క్రితమే పాక్‌ను వారి సొంతగడ్డపైనే చిత్తుచేసి చరిత్ర సృష్టించి జోరుమీదున్న బంగ్లాదేశ్.. అదే ఉత్సాహంతో భారత్‌నూ దెబ్బకొట్టాలని ఉవ్విళ్లూరుతున్నది. టీమ్ఇండియా బ్యాటర్లను తమ స్పిన్ బౌలింగ్‌తో బోల్తా కొట్టించాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా చెన్నైలోని వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో టాస్ గెలిచిన బంగ్లా సారథి నజ్ముల్ హుస్సేన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సుమారు ఆరు నెలల విరామం తర్వాత సొంతగడ్డపై టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భారత బ్యాట్స్‌మెన్ వారిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఈ ఏడాది ఆరంభంలో సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించిన తర్వాత రోహిత్ సేన ఆడనున్న తొలి టెస్టు ఇదే. త్వరలో న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు, నవంబర్ నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడనున్న నేపథ్యంలో భారత్‌కు బంగ్లాతో సిరీస్ కీలకం కానుంది. కాగా, స్పిన్ బౌలింగ్ ప్రధానాస్త్రంగా బంగ్లాదేశ్ బరిలోకి దిగుతుండగా, భారత్ మాత్రం ముగ్గురు పేస్ బౌలర్లను జట్టులోకి తీసుకున్నది. కుల్దీప్ యాదవ్‌ను పక్కనబెట్టిన రోహిత్.. అక్షర్దీప్కు టీమ్‌లో చోటిచ్చాడు. దీంతో సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌కు తోడుగా జడేజా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.
గత పదేండ్లలో భారత్‌కు స్వదేశంలో మరే జట్టుకూ లేని తిరుగులేని (40-4) రికార్డు ఉంది. ఈ దశాబ్ది కాలంలో టీమ్ఇండియా 4 టెస్టులు మాత్రమే ఓడింది. అయితే జట్టుగా రాణిస్తున్నా బ్యాటర్లు వ్యక్తిగతంగా స్పిన్ ఆడటంలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యర్థిని స్పిన్ ఉచ్చులో పడేస్తున్న భారత్.. తాము బ్యాటింగ్ చేసే క్రమంలో అదే ఉచ్చులో చిక్కుకుంటోంది. మరీ ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. 2021 తర్వాత స్పిన్‌ను ఎదుర్కోవడంలో తడబడుతున్నాడు. గత 15 టెస్టులలో స్పిన్ ఆడే క్రమంలో అతడి సగటు 30గా ఉండటం ఆందోళనకరం. మిడిలార్డర్లో కీలక ఆటగాడైన కేఎల్ రాహుల్ కూడా (23.40) కూడా తడబడుతున్నాడు. కెప్టెన్ రోహిత్‌శర్మ (15 మ్యాచ్‌లలో 44) మాత్రం మెరుగ్గా ఆడుతున్నాడు. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అదరగొట్టినా ఆ జట్టులో పెద్దగా పేరుమోసిన స్పిన్నర్ లేకపోవడం గమనార్హం. గిల్, దాదాపు రెండేండ్ల తర్వాత టెస్టు ఆడుతున్న రిషభ్ పంత్ మిడిలార్డర్లో స్పిన్ ఎలా ఆడతారో చూడాలి. బంగ్లా జట్టులో షకీబ్‌అల్ హసన్, తైజుల్ ఇస్లాం, మెహిదీ హసన్ మిరాజ్ వంటి మెరుగైన స్పిన్నర్లు
ఉండటంతో వారిని భారత బ్యాటర్లు ఏ మేరకు ఎదుర్కుంటారనేది ఆసక్తికరం. పాకిస్థాన్‌పై సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంలో ఈ ముగ్గురిదే కీలకపాత్ర. ఇక స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ అయిన చెపాక్‌లో తుది జట్టు ఎంపిక కూడా రోహిత్‌కు సవాల్‌గా మారింది. అశ్విన్, జడేజాతో పాటు మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ను తీసుకుంటారా? లేక యువ పేసర్లు యశ్ దయాల్, ఆకాశ్ దీప్‌లో ఎవరికి చోటిస్తారు? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో వెళ్లినా తుది జట్టులోఅక్షర్ పటేల్‌నూ ఆడించే అవకాశముంది. లోయరార్డర్లో అతడు ఉపయుక్తకరమైన బ్యాటర్ కానున్నాడు.
కొద్దిరోజుల క్రితమే పాక్‌ను చిత్తుచేసి చరిత్ర సృష్టించిన బంగ్లా అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. టీమ్ఇండియాతో ఆడిన 13 టెస్టులలోనూ ఆ జట్టుకు పరాభవాలే ఎదురవగా భారత్‌లో ఆడిన మూడు టెస్టులలో అయితే భారీ ఓటములే ఎదురయ్యాయి. పేపర్‌పై చూస్తే భారత్ బలంగా కనిపిస్తున్నా బంగ్లాను తేలిగ్గా తీసుకుంటే పప్పులో కాలేసినట్టే. సమర్థవంతమైన స్పిన్నర్లకు తోడు యువ పేసర్ నహిద్ రాణా, హసన్ మహ్మద్ వంటి బౌలర్లు ఆ జట్టు సొంతం. కెప్టెన్ శాంతో, లిటన్‌దాస్, ముష్పీకర్ రహీమ్‌తో పాటు షకిబ్, మిరాజ్ వంటి ఆటగాళ్ల రూపంలో ఆ జట్టుకు ఆల్‌రౌండర్లూ ఉన్నారు.
టీమ్ ఇండియాలో ఎవరెవరంటే..
రోహిత్‌శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, జడేజా, అశ్విన్, సిరాజ్, బుమ్రా, అక్షర్‌దీప్.
బంగ్లాదేశ్.. నజ్ముల్ హుస్సేన్ (కెప్టెన్), షాద్మాన్, జకీర్ హసన్, మోమినుల్, ముష్ఫికర్, లిటన్‌దాస్, షకీబల్ హసన్, మెహదీ హసన్, తస్కిన్ అహ్మద్, హసన్, నహిద్ రానా.