Bangladesh Team : టెస్టు, టీ20ల సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు (Bangladesh Team) భారత్‌లో అడుగు పెట్టింది.
పాకిస్థాన్‌పై చారిత్రక విజయంతో జోరు మీదున్న బంగ్లా బృందం ఆదివారం ఢాకా విమానాశ్రయం చేరుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(Najmul Hussain Shanto), లిటన్ దాస్, ప్రధాన కోచ్ చండిక హుతురుసింగేలతో పాటు జట్టు సభ్యులు అభిమానులతో ఫొటోలు దిగారు. ఆ తర్వాత అంతా భాతర విమానం ఎక్కారు. సాయంత్రం కల్లా బంగ్లా జట్టు చెన్నైలో దిగింది. అక్కడి నుంచి టీమ్ హోటల్ చేరిన బంగ్లా క్రికెటర్లకు సిబ్బంది ఘన స్వాగతం పలికారు.
స్వదేశంలో అల్లర్ల నేపథ్యలోనూ పాకిస్థాన్ గడ్డపై టెస్టు సిరీస్ గెలుపొందిన బంగ్లాదేశ్ విజయోత్సాహంతో భారత్‌కు వస్తోంది. తమ జట్టు సభ్యులు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉన్నారని కెప్టెన్ శాంటో అన్నాడు. ‘ఇండియాతో సిరీస్ మాకు సవాలే. కానీ, పాకిస్థాన్‌పై విజయం సాధించాం. ఇప్పుడు మా జట్టు సభ్యులలో, బంగ్లా ప్రజల్లో విజయం సాధిస్తామనే నమ్మకం పెరిగింది’ అని మీడియా సమావేశంలో శాంటో వెల్లడించాడు.
Bangladesh Team arrive in Chennai for the first Test of their ICC WTC series against India.#BCB #Cricket #BDCricket #Bangladesh #INDvsBAN pic.twitter.com/wBwapu3jep
— Bangladesh Cricket (@BCBtigers) September 15, 2024
భారత్, బంగ్లాల మధ్య తొలి టెస్టు సెప్టెంబర్ 19న, అనంతరం కాన్పూర్‌లో సెప్టెంబర్ 27న రెండో టెస్టు జరుగనుంది. ఆ తర్వాత టీ20 సిరీస్‌లో ఇరుజట్లు తలపడనున్నాయి. అక్టోబర్ 3న గ్వాలియర్‌లో తొలి మ్యాచ్, అక్టోబర్ 9న ఢిల్లీలో రెండో టీ20, అక్టోబర్ 12న హైదరాబాద్‌లో మూడో టీ20 జరుగనున్నాయి.
ఈ మధ్యే పాకిస్థాన్ పర్యటనలో నజ్ముల్ హుసేన్ శాంటో సారథ్యంలోని బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్‌పై టెస్టుల్లో తొలి విజయం నమోదు చేసి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన రావల్పిండి టెస్టులో బంగ్లా 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ముష్ఫికర్ రహీమ్(191) సూపర్ సెంచరీకి.. మెహిదీ హసన్ మిరాజ్(77, 4/21) ఆల్‌రౌండ్ షో తోడవ్వడంతో పాకిస్థాన్‌కు ఓటమి తప్పలేదు.
ఇక రెండో టెస్టులోనూ బంగ్లా పేసర్ల ధాటికి పాక్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. దాంతో పాక్ గడ్డపై తొలిసారి బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది. మరోవైపు.. దాదాపు ఏడాది విరామ తర్వాత టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్లో ఆడుతోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రోహిత్ సేనకు ఈ సిరీస్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది.