Delhi CM | ఢిల్లీ మద్యం పాలసీలో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం విడుదలయ్యారు. సీబీఐ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలతో ఆదివారం కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రెండురోజుల్లో పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్రతో కలిసి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరనున్నట్లు వెల్లడించారు. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
అయితే, ముందస్తు ఎన్నికలకు వెళ్తారా..? లేదంటే సీఎం పదవి నుంచి తప్పుకొని మరొకరికి బాధ్యతలు అప్పగిస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే, ప్రస్తుతం కేజ్రీవాల్ తన స్థానంలో మరో ఆప్ నేతకు సీఎంగా ఛాన్స్ ఇవ్వనున్నారు. ఇదే జరిగితే ఎవరు సీఎంగా ప్రమాణం చేస్తారన్న విషయంపై ఉత్కంఠ నెలకొన్నది. త్వరలోనే ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరుగనున్నది. ఇందులో సీఎల్పీ లీడర్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పదవి రేసులో నలుగురు ప్రముఖ పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో విద్యాశాఖ మంత్రి అతిషి మర్లెనా, ఆరోగ్యశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్, కైలాష్ గహ్లోత్‌తో పాటు సునీత్రా కేజ్రీవాల్ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి.
ప్రస్తుత విద్యాశాఖ మంత్రి అతిషి మర్లెనా సీఎం రేసులో ఉన్నారు. కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన సమయంలో ఆమె ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వం, పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ ముందున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కేజ్రీవాల్‌కు బదులుగా జాతీయ జెండాను ఎగుర వేసేందుకు అతిషి పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించారు. ఈ క్రమంలో ఆమె అభ్యర్థిత్వాన్ని మరింత బలపరుస్తున్నది.
సీఎం పదవి రేసులో సౌరభ్ భరద్వాజ్ ఉన్నారు. ఆయన కేజ్రీవాల్ కేబినెట్లో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో ఆయన కీలక నేతల్లో ఒకరు. ఆయన కేజ్రీవాల్‌కు సన్నిహిత మిత్రుడు. ఆయన జైలులో ఉన్న సమయంలో చురుగ్గా వ్యవహరించారు. పార్టీ వేదికలు, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ తన ఉనికిని చాటుకున్నారు. ప్రభుత్వంలో సౌరభ్ ఏడుశాఖలకు మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన సైతం పోటీదారుగా ఉన్నారు.
కైలాష్ గహ్లోత్ కేజ్రీవాల్‌కు కీలక సహచరుడు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎనిమిది శాఖల బాధ్యతలను చూసుకుంటూ వస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలోనూ కీలక బాధ్యతలు చేసుకుంటూ వస్తున్నారు. పార్టీలో ఆయన కూడా అగ్రనేత. ఈ క్రమంలో కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడంతో బాధ్యతలను కైలాష్ గహ్లోత్‌కు సీఎంగా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
సీఎం కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ పేరు సైతం వినిపిస్తున్నది. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతలను ఒకే వేదికపైగా తీసుకురాగలిగారు. బహిరంగ సభలు, సంకీర్ణ చర్చల్లోనూ చురుగ్గా వ్యవహరించారు. ఈ క్రమంలో ఆమె సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రభుత్వంపై మరింత పట్టు సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు.