Bangladesh Cricket Board : పురుషుల టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (Bangladesh Cricket Board) బెట్టువీడడం లేదు. భారత్‌తో ఆడబోమని ఐసీసీ (ICC)కి లేఖ రాసిన బంగ్లాదేశ్ ఎలాగైనా పంతం నెగ్గించుకోవాలనకుంటోంది. కానీ, ఐసీసీ మాత్రం ఆడితే భారత్‌లోనే ఆడండి.. లేదంటే వేటు తప్పదు అని హెచ్చరించింది. జనవరి 21 లోపు ఏదో ఒకటి తేల్చుకోవాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు అల్టిమేటం జారీ చేసింది. అయినా కూడా బంగ్లా ప్రభుత్వం మాట వినేలా కనిపించడం లేదు. క్రీడా సలహాదారు అసిఫ్ నజ్రుల్ (Asif Nazul) మాట్లాడుతూ తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
భారత్ వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఆడడంపై సందిగ్ధం కొనసాగుతోంది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని లేదంటే.. గ్రూప్ స్వాపింగ్ చేయాలని ఆ దేశ బోర్డు డిమాండ్ చేస్తోంది. కానీ, ఇదివరకే షెడ్యూల్ ప్రకటించినందున మార్పులకు అంగీకరించమని ఐసీసీ స్పష్టం చేసింది. అంతేకాదు ఒకవేళ ఇండియాలో ఆడకూడదనుకుంటే.. ఐర్లాండ్‌కు అవకాశమిస్తామని చెప్పేసింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వ క్రీడా సలహాదారు భారత్‌లో ఆడబోమనే మాటనే పునరుద్ఘాటించారు.
ICC’s conditions unacceptable, Bangladesh adviser Asif Nazrul
Read @ANI Story | https://t.co/fVmQ1iNrI9#ICC #Bangladesh #AsifNazrul pic.twitter.com/93vEba4y99
— ANI Digital (@ani_digital) January 20, 2026
‘ప్రపంచకప్‌లో మా జట్టు స్థానంలో స్కాట్లాండ్కు అవకాశమిస్తారనే విషయం నాకు తెలియదు. భారత బోర్డు ఒత్తిడికి ఐసీసీ తలొగ్గి మాపై ఒత్తిడి పెంచాలనుకోవడం సరికాదు. ఐసీసీ సూచనలకు మేము అంగీకరించం. గతంలో షెడ్యూల్ మార్చిన ఉదాహరణలున్నాయి. భారత్‌లో ఆడమని పాకిస్థాన్ బోర్డు పట్టుపడితే ఐసీసీ దిగొచ్చి వేదికను మార్చింది. మేము వేదికను మార్చాలని మాత్రమే అడిగాం. అందుకు అవకాశమివ్వకుండా ఎలాగైనా ఒత్తిడి పెంచి భారత్‌లో ఆడేలా చేయాలనుకోండం ఆమోదయోగ్యం కాదు’ అని ఆయన వెల్లడించారు.
భద్రతా కారణాలరీత్యా భారత్‌లో ప్రపంచకప్ ఆడకుండా ఉండేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB) చేస్తున్న ప్రయత్నాలు అన్నీ బెడిసి కొడుతున్నాయి. గ్రూప్ స్వాపింగ్ చేయాలని ఐసీసీకి విన్నవించుకున్నా నిరాశే ఎదురైంది. ఎందుకంటే.. తమను గ్రూప్ బీలోకి మార్చాలని అభ్యర్థించిన బంగ్లాదేశ్ ఆశలపై క్రికెట్ ఐర్లాండ్ (Cricket Ireland) నీళ్లు చల్లింది. ఎట్టిపరిస్థితుల్లోనూ గ్రూప్ మారబోమని, శ్రీలంకలోనే తాము ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడుతామని ఆదివారం ఐర్లాండ్ స్పష్టం చేసింది.
‘గ్రూప్ స్వాపింగ్‌కు’ అంగీకరించమని క్రికెట్ ఐర్లాండ్ (Cricket Ireland) ప్రకటించడమే ఆలస్యం.. భారత్‌లోనే వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడాలని బంగ్లాను ఐసీసీ ఆదేశించింది. కాదు.. కుదరదు అని బెట్టు చేస్తే కొత్త జట్టుకు అవకాశమిస్తామని బంగ్లా బోర్డును ఐసీసీ హెచ్చరించింది. అంతేకాదు ఆడుతారా? టోర్నీ నుంచి తప్పించమంటారా? జనవరి 21వ తేదీలోపు ఒకటి తేల్చుకోవాలని అల్టిమేటం జారీ చేసింది. ఐపీఎల్ నుంచి బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను తప్పించడంతో బీసీబీ, బీసీసీఐ మధ్య దూరం పెరిగింది. దాంతో.. ప్రపంచకప్ కోసం ఇండియాకు తమ జట్టును పంపించబోమని ఆ బంగ్లాదేశ్ బోర్డు స్పష్టం చేసింది.