T20 World Cup 2024 : మహిళల టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్(Bangladesh) స్క్వాడ్‌ను ప్రకటించింది. ఆసియా కప్‌లో జట్టును నడిపించిన నిగర్ సుల్తానా కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఎంపిక చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..? ఈసారి యువ రక్తంతో కూడిన స్క్వాడ్‌ను యూఈఏకి పంపాలని బీసీబీ సెలెక్టర్లు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే వెటరన్ ఆల్‌రౌండర్ రుమనా అహ్మద్(Rumana Ahmed)కు షాకిచ్చారు.
వరల్డ్ కప్ స్క్వాడ్ ఎంపికపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సభ్యులు, సెలెక్టర్లు ఈసారి పెద్ద కసరత్తు చేశారు. ఫామ్ లేమితో జట్టుకు భారంగా మారిన సీనియర్లకు చెక్ పెట్టారు. ఈ ఏడాది మహిళల ఆసియా కప్‌లో విఫలైమన రుబే హైదర్, షరిఫా ఖాతూన్, సబికున్ నహర్, ఇష్మా తంజీమ్లపై వేటు వేశారు. అన్క్యాప్డ్ ప్లేయర్లు తాజ్ నెహర్(Taj Nehar), దిశా బిస్వాల్(Disha Biswal)లను తొలిసారి వరల్డ్ కప్ స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. మరోవైపు.. శాంతి రాణి, ఫాహిమ ఖాతూన్, శోభన మోస్ట్రేలకు మరో అవకాశం ఇచ్చారు.
Bangladesh Squad for ICC Women’s T20 World Cup 2024. 🇧🇩 🫶 #BCB #Cricket #T20WorldCup2024 pic.twitter.com/tol7HJc5im
— Bangladesh Cricket (@BCBtigers) September 18, 2024
బంగ్లాదేశ్ వరల్డ్ కప్ స్క్వాడ్ : నిగర్ సుల్తానా, నహిద అక్తర్, ముర్షిదా ఖాతున్, షొర్నా అక్తర్, రీతూ మోనీ, శోభన మోస్ట్రే, రబెయ ఖాన్, సుల్తాన ఖాతున్, ఫాహిమా ఖాతున్, మరుఫా అక్తర్, జహనార అలామ్, దిలరా అక్తర్, తాజ్ నెహర్, శాంతి రాణి, దిషా బిస్వాస్.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా అక్టోబర్ 3వ తేదీ నుంచి మహిళల టీ20 వరల్డ్ కప్ మొదలవ్వనుంది. లీగ్ దశలో బంగ్లా తొలుత స్కాట్లాండ్ (Scotland)ను ఢీ కొట్టనుంది. అనంతరం నిగర్ సుల్తానా బృందానికి ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్ల రూపంలో బలమైన ప్రత్యర్థులు ఎదురుకానున్నారు. ఇప్పటివరకూ మోగా టోర్నీ చరిత్రలో బంగ్లాదేశ్ సెమీస్ ఆడిన దాఖలాలు లేవు. అందుకని ఈసారి ఎలాగైనా తమ రికార్డును మెరుగుపరుచుకోవాలని బంగ్లా పట్టుదలతో ఉంది.