న్యూఢిల్లీ: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన దక్షిణాఫ్రికా.. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో విజయానికి చేరువైంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 453 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 217 పరుగులకే ఆలౌటైంది. ముష్ఫికర్ రహీమ్ (51) టాప్ స్కోరర్ కాగా.. సఫారీ బౌలర్లలో ముల్డర్, హర్మెర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం దక్షిణాఫ్రికా 176/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి బంగ్లాకు 413 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సరెల్ ఎర్వీ (41), వెరీనె (39 నాటౌట్), బవుమా (30) రాణించారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక భారీ లక్ష్యఛేదనకు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా.. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (13), మహ్మూదుల్ హసన్ (0), నజ్ముల్ హసన్ (7) విఫలమయ్యారు. చేతిలో 7 వికెట్లు ఉన్న బంగ్లాదేశ్ విజయానికి ఇంకా 386 పరుగుల దూరంలో ఉంది. కెప్టెన్ మోమినుల్ హక్ (5) క్రీజులో ఉన్నాడు. సఫారీ బౌలర్లలో కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు.