చత్తోగ్రమ్: స్వదేశంలో జింబాబ్వేతో తొలి టెస్టులో ఎదురైన ఓటమికి రెండో టెస్టులో బంగ్లాదేశ్ బదులు తీర్చుకుంది. చత్తోగ్రమ్ వేదికగా మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో బంగ్లా ఇన్నింగ్స్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. షాద్మన్ (120)తో పాటు మెహిదిహసన్ మిరాజ్ (104) శతకాలతో కదం తొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 444 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో ఆ జట్టు 217 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన జింబాబ్వే.. 46.2 ఓవర్లలో 111 రన్స్‌కే ఆలౌట్ అయింది. బెన్ కరన్ (46) టాప్ స్కోరర్. బ్యాటింగ్‌లో సెంచరీ చేసిన మిరాజ్.. బంతితోనూ ఐదు (5/32) వికెట్లు పడగొట్టి బంగ్లా విజయంలో కీలకపాత్ర పోషించాడు. మిరాజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ దక్కాయి.